GT Hemanth Kumar, Tirupati, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మద్యపాన నిషేధం (Liquor Ban) అమలు చేస్తామని ప్రభుత్వం (AP Government) చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే మద్యం షాపుల సంఖ్యను తగ్గించి, మద్యం రేట్లను పెంచడం ద్వారా తాగేవారి సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తోంది. అలాగే పాత బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పొరుగురాష్ట్రాల నుంచి అక్రమ మధ్యం ఏపీకి రవాణా అవుతోంది. అంతేకాదు కొందరు అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఏపీలో ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మద్యం మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే సీక్రెట్ గా ఇతర రాష్ట్రాల మద్యం సరఫరా చేస్తున్న మాఫియాలోని ఒకడు ఓ మహిళపై అఘాయిత్యానికి యత్నించిన విషయం ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లా రెండు పొరుగు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటోంది. ఇక్కడ సరిహద్దుకు అనుగుణంగా భాషలోని యాస కూడా మారుతూ ఉంటుంది. ఐతే రాష్ట్ర సరిహద్దులో ఉన్న పలమనేరు నియోజకవర్గంలో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. ఇక్కడ కొందరు అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడమే కాకుండా... డోర్ టూ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇవన్నీ పోలీసులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారట. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో... వారిని పట్టుకుంటే ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో పోలీసులు సైలెంట్ అయిపోతున్నారట. పలమనేరుకు అనుకోని కర్ణాటక మద్యం దుకాణం ఉండటం మరో విశేషం.
పలమనేరులో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ మాఫియాలోని ఒకడు ఓ మహిళపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. గంగవరం మండలం కల్లుపల్లి గ్రామ శివారులోని ఓ వ్యక్తికి మద్యం డోర్ డెలివరీ చేసిన మధు అనే వ్యకి.. అతడు తాగిన మత్తులో ఉండగా అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయబోతే ఆమె నోరు మూసేసి తన కామవాంఛ తీర్చుకున్నాడు.
నాలుగు రోజుల క్రితం ఈ ఘోరం జరిగింది. ఐతే విషయం బయటకు వస్తే తమ పరువుతో పాటు ఆదాయం వచ్చే మార్గం కూడా పోతుందని అధికార పార్టీ నేతలు రాజీకి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని బాధితురాలు స్థానికులతో చెప్పి వాపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఇక్కడ సరిగా పనిచేస్తోందా..? లేదా..? అనే అనుమానులు కలుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని సరిహద్దులు దాటించడమే కాకుండా డోర్ డెలివరీ చేసేంతటి ధైర్యం ఎలా వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime, Liquor, RAPE