TIRUPATI KADAPA PRIVATE HOSPITALS STOPPED NEW ADMISSIONS OF COVID PATIENTS TO PROTEST AGAINST GOVERNMENT RAIDS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Private Hospitals: ప్రాణాలు పోతున్నా పైసలే ముఖ్యం... సీఎం సొంత జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దుస్సాహసం...
కడపలో కరోనా చికిత్స నిలిపేసిన ప్రైవేట్ ఆస్పత్రులు..
కరోనా కాలంలో ఫీజుల రూపంలో బాధితుల రక్తాన్ని పీలుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పుడు సరికొత్త దందాకు తెరలేపుతున్నాయి.
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యం చేసేవాడు దేవుడితో సమానం అని అర్ధం. కానీ కొన్ని ఆస్పత్రులు మాత్రం పైసామే పరమాత్మా అనే బాటలోనే నడుస్తున్నాయి. కరోనా వేళ చావుబతుకుల మధ్య ఆస్పత్రులకు వస్తున్న రోగుల రక్తం పీలుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పుడు కొత్త పాటపాడుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంటే.. ఆస్పత్రుల యాజమాన్యాలకు ఎక్కడ లేని కోపం వస్తోంది. ప్రభుత్వం తన విధులు నిర్వర్తిస్తుంటే కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రం అవి వేధింపుల్లాగా కనిపిస్తున్నాయి. డాక్టర్లను విధించడానికి నిరసనగా తమ ఆస్పత్రుల్లో కరోనా రోగులను చేర్చుకోబోమని బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ఓ వైపు పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుంటే ఆస్పత్రులు మాత్రం అదేదో సమాజ సేవచేస్తుంటే ప్రభుత్వం అడ్డుకున్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా ఇది సాహసమనే చెప్పాలి. ఇదే సమయంలో చట్టం పర్యావసనాలు తెలియకుండా మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నాయన్న మాట కూడా వినిపిస్తోంది.
గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ సేవలు అందిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న 9 ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. దీంతో ఆయా ఆస్పత్రులు కోవిడ్ ఆడ్మిషన్లు నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతఇలాకాలోని కొమ్మా హాస్పిటల్, తిరుమల హాస్పిటల్, శ్రీకర హాస్పిటల్ పాటు మరికొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కొవిడ్ పేషెంట్లను చేర్చుకునేది లేదని బోర్డులు ఏర్పాటు చేశాయి. ఈ విషయంలో కడపలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నీ సిండికేట్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. కడపలోని IMA హాలులో సమావేశమైన ఆస్పత్రుల యాజమాన్యాలు.. ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది..?
దేశంలోని పాండమిక్ చట్టాల ప్రకారం విపత్కర పరిస్థితుల సమయంలో ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఆస్పత్రులతో పాటు ప్రభుత్వానికి అవసరమైన భవనాలు, వాహనాలను అవసరాన్ని బట్టి తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి నిరాకరించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కానీ దోపిడీలో ముండండే కార్పొరేట్ ఆస్పత్రులు.. తమ దందాకు అడ్డొస్తే ట్రీట్ మెంట్ నిలిపేస్తామని హెచ్చరించడం చట్టాన్ని ధిక్కరించడమేనని నిపుణులు చెప్తున్నారు. కొవిడ్ రోజురోజుకీ పదులకొద్దీ ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇలాంటి సమయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించాల్సింది పోయి.. భారీగా ఫీజులు వసూలు చేయడం.. అడ్డుకున్న ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేలా ట్రీట్ మెంట్ నిలిపేయడంపై కొవిడ్ రోగులతో పాటు వైద్య నిపుణులు మండిపడుతున్నారు. అందునా సీఎం సొంత జిల్లాలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.