మా ఇంటి పిచ్చుకలను మేమే కాపాడుకుంటాం అని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ, వ్యవస్థాపక కార్యదర్శి జె వి రత్నం పేర్కొన్నారు. ఈ ఏడాది పదివేల పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేయడం, లక్షమంది విద్యార్థులకు అవగాహన కలిగించడం తమ కార్యక్రమంలో ప్రధానమైనదిగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల చేత "మా ఇంటి పిచ్చుకలను మేమే కాపాడుకుంటాం. పిచ్చుకల కోసం మా ఇంటిలో గూడు, వీటికోసం పాత్రలు ఏర్పాటు చేస్తామని, ప్రతి రోజు నీళ్లు, ఆహారం అందుబాటులో ఉంచుదామని, పిచ్చుకల సంతతిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అని విద్యార్థుల చేత ప్రమాణం చేయిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 20వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని, 500 వరకు పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ ఏడాది చివరి వరకు కొనసాగిస్తామన్నారు.
అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవజాతులలో చేరిపోయిన పిచ్చుకల సంతతి విశాఖ నగరవాసుల కృషితో బాగా పెరిగింది అన్నారు. నగరంలో వేలాదిమంది పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. నీళ్లు ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు. 2000 సంవత్సరం నుండి గ్రీన్ క్లైమేట్ టీం చేస్తున్న కృషి ఫలితంగా నగరవాసుల్లో చైతన్యం చాలా వరకు వచ్చింది అన్నారు. పిచ్చుకల కోసం వరి కంకుల గుత్తులు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
20వేలకు పైగా నగరంలో పిచ్చుక గూళ్ళు గడిచిన 20 ఏళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిచ్చుక గూళ్ళు కొన్ని తామె స్వయంగా తయారు చేస్తున్నామని వివరించారు.మన బాల్యపు జ్ఞాపకం. మనల్ని నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక. ఇది ఒకప్పుడు మన ఇళ్ళ చూరులు లోపల గూళ్ళు పెట్టుకునేవి, మన కాంక్రీట్ భవనాలలో గూళ్ళు పెట్టుకోవడానికి ఈరోజు చోటు లేదు. అందుకే మనం వాటికి గూళ్లు ఏర్పాటు చేయాలి. గడ్డి మైదానాలు లేవు, ఆ గడ్డి విత్తనాలు ఇవి ఆహారంగా తినేవి. అవి లేకపోవడంతో వీటి ఆహారం కరువైంది.
వరి చేల కొడుతున్న రసాయన క్రిమిసంహారకాలు వీటిని ప్రమాదంలో పడేసాయి. బియ్యం పిండి ముగ్గు వేసే రోజుల్లో ఆ ముగ్గుని ఆహారంగా తిని జీవించేవి. ప్రస్తుత రోజుల్లో ముగ్గు పిండితో ముగ్గు వేయడం మానేశారు. అత్యంత ప్రమాదకరమైన యాష్ ముగ్గు వాడుతున్నారు.
సెల్ టవర్ ల రేడియో ధార్మికత, హై పవర్ విద్యుత్తు టవర్ లైన్లో నుండి వచ్చే విద్యుత్ అయస్కాంత తరంగాలు పిచ్చుకలకు సంతతికి ముప్పు తెచ్చాయి. నేడు ఇంటి పిచ్చుక జీవనం ప్రమాదంలో పడింది. మనకు మన పంటలకు మేలు చేసే పిచ్చుకల సంతతి పరిరక్షణకు మనమంతా కృషి చేస్తామని ప్రతిన భూమి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు.
ప్రతి విద్యాసంస్థలోను విద్యార్థుల చేత పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని, పిచ్చుకల కోసం గూళ్ళు నీరు ఆహారం ఏర్పాటు చేసేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. జీవవైవిద్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.