ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలు (AP Inter exams) జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఐతే తిరుపతి జిల్లా గూడూరులోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి జిల్లా గుంటూరులోని DRW మహిళా కాలేజీలోని పరీక్షా కేంద్రానికి సైదాపురంకు చెందిన విద్యార్థి సతీష్.. పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసులు చెక్ చేస్తుండగా.. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని కానిస్టేబుల్ తో చెప్పాడు. దీంతో పక్కన కూర్చొబెట్టగా ఊపిరాడటం లేదంటూ మెలికలు తిరిగిపోయాడు. దీంతో పోలీసులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి చనిపోవడంతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. కళ్లముందే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కూడా ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సతీష్ మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎందుకిలా జరిగిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఐతే విద్యార్థికి పరీక్షల భయంతో గుండెపోటు వచ్చిందా..? లేక ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.