TIRUPATI HUSBAND DIED IN RAILWAY STATION IN FRONT OF HIS WIFE AFTER RECOVERING FROM COVID 19 IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Andhra Pradesh: కరోనా వదిలినా... మరణం వదల్లేదు... భార్య ఒడిలోనే కన్నుమూసిన భర్త...
ప్రతీకాత్మకచిత్రం
కరోనా కాలం జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రతి కుటుంబంలోనూ అయినవాళ్లను దూరం చేస్తోంది. కానీ ఈఘటన మాత్రం ప్రతిఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
కరోనా వైరస్.. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. సైలెంట్ కిల్లర్ గా మారిన వైరస్ ప్రాణాలను హరించేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రోజుల వ్యవధిలోనే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. కొందరికి వైరస్ తగ్గినా.. శరీరం బలహీనంగా మారుతోంది. మహమ్మారిని వదిలించుకున్నామన్న సంతోషం ఎంతోసేపు నిలవడం లేదు. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. మహమ్మారి వదిలిపోయిందేలే అని అనుకునేలోపే ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరుకు చెందిన చంద్రశేఖర్, ఆయన భార్య బెంగళూరులో వలస జీవనం సాగిస్తుంటారు. అక్కడే ఉండి కూలిపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. దంపతులిద్దరికీ కరోనా రావడంతో 15 రోజుల పాటు కుప్పం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఇద్దరూ కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్లేందుకు కుప్పం రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ఐతే ఫ్లాట్ ఫారంపై కుర్చొని ఉండగా.. చంద్రశేఖర్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికే భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. తన కళ్లముందే భర్తను కోల్పోవడంతో చంద్రశేఖర్ భార్య గుండలవిసేలా రోదించారు. తనకింక దిక్కెవరంటూ ఆమె విలపించిన తీరు అక్కడున్నవారిని కన్నీరు పెట్టించింది.
ఐతే కరోనాకు చికిత్స తీసుకొని నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆ వెంటనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐతే కరోనా సోకిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయని వైద్యనిపుణులు ఇప్పటికే చెప్పారు. ఐతే చంద్రశేఖర్ విషయంలో ఏం జరిగిందనేది మాత్రం తెలియడం లేదు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ కేసుల్లో చిత్తూరే టాప్ లో ఉంటోంది. గురువారం కూడా 2,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 20,689 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 1,009 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 1,33,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి నగరాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.