GT Hemanth Kumar, Tirupathi, News18
దాంపత్య జీవితం అంటేనే నమ్మకం.., ప్రేమానురాగాలతో కూడిన పవిత్ర బంధం. కలసి ఏడు అడుగులు నడిచినా.., దేవుని ఎదుట ఉంగరాలు మార్చుకున్నా.... పెద్దల సమక్షంలో నిఖా చేసుకున్న జీవితాంతం ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటేనే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన వివాహ బంధం ప్రశాంతంగా సాగుతుంది. ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకుంటే.. చిన్న విషయాలకే గొడవ పడేలా చేస్తుంది. చిన్నచిన్న మనస్పర్థల వల్ల మొదలయ్యే అనుమానం పెనుభూతమై జీవితాలను ఛిద్రంచేస్తుంది. ఒక్క అనుమానంతో నిండు ప్రాణాన్ని బలితీసుకొనేలా చేస్తున్నాయి. విధులకు వెళ్లిన భార్య ఇంటికి ఆలస్యంగా వచ్చిందనే నేపంతో కలయముడైయ్యాడు ఓ భర్త. ఏకంగా భార్యపై హత్యాయత్నం చేసేవరకు వెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పుంగనూరు నియోజకవర్గంలోని ఈడిగపల్లి సమీపంలో ఉన్న యాతాలవంకకు చెందిన సురేఖ(31) జీవనోపాధి నిమిత్తం మదనపల్లెలోని మంజునాథ్ కాలనీలో స్థిరపడింది. స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తూ ఉపాధి పొందుతోంది. గతంలో ఓ వ్యక్తితో పెళ్లవగా మనస్పర్థలు రావడంతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో తన నివాసానికి సమీపంలో ఉంటున్న ఎల్లప్ప అనే వ్యక్తితో ప్రేమలో పడింది. మొదటి భర్తతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న అనంతరం ఎల్లప్పను పెళ్లిచేసుకుంది. ఎనిమిదేళ్ళుగా వీరి జీవతం సాఫీగానే సాగుతోంది. ఈ క్రమంలో నలుగు పిల్లలు కూడా పుట్టారు.
ఐతే సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమాన బీజం నాటుకుంది. భార్య నడవడికలో మార్పు రావడంతో ఆమె పనిచేసే చోట ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని ఎల్లప్ప అనుమానించాడు. భార్య ఎవరితో మాట్లాడినా సరే ఎల్లప్ప ఆమె నిలదీసేవాడు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 17న సురేఖ ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సురేఖ.. భర్తకు ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహించిన ఎల్లప్ప అతని వద్ద ఉన్న టైలరింగ్ కత్తిరిని తీసుకుని భార్యపై ఒక్కసారిగా దాడి చేసిన ఒళ్ళంతా విచక్షణ రహితంగా పొడిచాడు.
దీనిని గమనించిన స్థానికులు బాధితురాలు సురేఖను 108 సాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. స్ధానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న మదనపల్లె టూ టౌన్ ఘటనాస్థలిని పరిశీలించి ఎల్లప్పను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. తాను డ్యూటీకి వెళ్లినప్పుడు భార్య వ్యభిచారం చేస్తోందని తెలిసి ఓ లారీ క్లీనర్ నాన్ స్టిక్ పాన్ తో భార్య తలపై కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Husband kill wife