హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Brahmotsavalu-2021: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!

Tirumala Brahmotsavalu-2021: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!

శ్రీవారి బ్రహ్మోత్సవాలు (ఫైల్)

శ్రీవారి బ్రహ్మోత్సవాలు (ఫైల్)

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల (Tirumala Temple) సిధ్ధం మవుతోంది. కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu-2021) ప్రతి ఏడాది అత్యంత శోభాయమానంగా సాగుతాయి.

GT Hemanth Kumar, Tirupati, News18

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిధ్ధం మవుతోంది. కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అత్యంత శోభాయమానంగా సాగుతాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావంతో ఏకాంతంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavalu-2021) నిర్వహించిన టీటీడీ ఈ ఏడాది కూడా ఏకాంతానికి మొగ్గు చూపింది. శ్రీవారి ఆలయంలోని కల్యాణ వేదికలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ. కలియుగంలో భక్తులను రక్షించేందుకు సాక్షాత్తూ విష్ణుమూర్తే... వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా ఏడుకోండల్లో కోలువైయున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు. అందుకే శ్రీవారిని శ్రీనివాసుడుగా, తిరుమలేశుడుగా, వెంకటేశ్వరుడిగా. ఆపదమొక్కులవాడుగా, సప్తగిరీశుడుగా, గోవిందుడుగా ఇలా అనంతమైన పేర్లతో భక్తులు స్వామివారిని కొలుస్తారు. అందుకే తిరుమలేశుని కోవెల నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రసిద్ది గాంచింది.

బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం అద్భుతం...

ప్రతి రోజుకు దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులు అవుతుంటారు. సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది. సాధారణ భక్తులే కాదు సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ వేత్తల గోవింద నామస్మరణలతో ప్రతి నిత్యం సప్తగిరులు మార్మోగుతుంటాయి. ఇక్కడ కోలువైయున్న స్వామి వారిని చూసిన కనులే మళ్లీ మళ్లీ దర్శించుకుంటాయి. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివితీరదు. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ ఏడుకొండలవాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా ఏడాదికి ఒక్కసారే జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటీ ఉవ్విళ్లూరుతుంది.

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీహరి
శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ (ఫైల్)

బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..!

స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మత్సవాలనీ.., వైభవంగా జరిగే వేడుకులు కావడంతో బ్రహ్మోత్సవాలనీ పేరొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాసంలోని స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం పూర్తయ్యే విధంగా ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అధిక మాసం వచ్చే సందర్భాల్లో రెండు బ్రహ్మోత్సవాలు భాద్రపద మాసంలో(కన్యామాసం) ఒకటి. దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం నిర్వఠహించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాలు, శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చక్రవర్తులు, మహరాజులు తమ విజయపరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు. నెలకొకటి చొప్పున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది.

తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు రాత్రి గజవాహనంపై విహరిస్తున్న గోవిందుడు
శ్రీవారికి గజవాహన సేవ (ఫైల్)

1400 ఏళ్లుగా సాంప్రదాయం

క్రీ.శ.614లో పల్లవరాణి సమవాయ్( పేరిందేవి) మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహుకరించింది.పెరటాసి నెలలో (కన్యామాసం)జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు. ఆ తరువాత క్రీ.శ.1254 చైత్ర మాసంలో తెలుగు పల్లవరాజు విజయ గండ గోపాలదేవుడు,క్రీ.శ.1328 ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువేంకట యాదవ రాయలు, క్రీ.శ.1429 ఆశ్వయుజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు, క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ల పేరుత హరిహరిరాయలు, క్రీ.శ.1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు, ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు. క్రీ.శ.1339 నుంచి మలయప్ప కోనలో లభించిన మలయప్ప స్వామిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది.

పుష్పకవిమానం (ఫైల్)

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం

రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలసిన పోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తరువాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్కల్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ వచ్చాయి. కొండల రాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటేల ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం మహద్భాగ్యంతో భక్తులు భావిస్తారు. ప్రతి ఏడాది థ్వజారోహణతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా, పరిమళ భరిత పుష్పాలతోనూ, విద్యుద్దీపాలతోనూ పూల పందిళ్లతోనూ, ఎంతో అందంగా అలంకరిస్తారు.

విశేషవాహన సేవలు...

ఇక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ప్రతి రోజూ ఉదయం రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లతో కలసి వివిధ వాహనాలపై ఉరేగుతారు. ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటీ తిరుమలకు పోటెత్తుతారు..పెద్ద శేషవాహనం,చిన్న శేషవాహనం,హంస వాహనం,సింహ వాహనం,ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వ వాహనాలపై 9 రోజుల పాటు ఉరేగి భక్తులకు కనువిందు కలిగిస్తాడు ఆ కోనేటి రాయుడు. మోహినీ అవతారంలో మురిపించి ధగధగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ చెక్కరధంపై భక్తులను కఠాక్షిస్తూ స్వామి మాఢ వీధుల్లో ఊరేగి అభయ ప్రదానం చేస్తారు.

గరుడోత్సవానికి ప్రాముఖ్యత

ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.. స్వామి వాహనం గరుత్మంతుడు. ఉత్సవాల్లో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకుని సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయి. గోవిందనామస్మరణలతో ఏడుకొండలు మారుమ్రోగతాయి. ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్రస్నాన కార్యక్రమమూ వేడుకగా జరుగుతుంది. భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్య స్నానాలాచరించి దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే థ్వజ అవ రోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం మవుతాయి.

First published:

Tags: Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd news

ఉత్తమ కథలు