GT. Hemanth Kumar, Tirupathi, News18
చంద్రబాబు (Nara Chandra Babu naidu) రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం కుప్పం (Kuppam). దాదాపు 40 ఏళ్ళుగా కుప్పంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న చంద్రబాబు జోరుకు వైఎస్ఆర్సీపీ (YSRCP) బ్రేకులు వేసింది. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు హవాకు గండిగొడుతున్నారనే చెప్పుకోవాలి. కుప్పం ప్రస్థానంలో ఇప్పటి వరకు బాబు ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. 1989 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుస విజయాలతో దూసుకెళ్లిపోయారు. అధికారం చేజారినా.., చిత్తూరు జిల్లాలో ఎదురుగాలి వీచినా.., ఒక్క కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు విజయకేతనాన్ని ఎగుర వేశారు. కానీ 2019 ఎన్నికల నుంచే కుప్పంలో సీన్ రివర్స్ అవుతూ వస్తోంది.
2019 ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసి గెలిచినా.., మొదటి రెండు రౌండ్లలో వెనుకబడ్డారు. ఒక దశలో చంద్రబాబు ఓటమి పాలు అవుతారన్న వాదనలు వినిపించాయి. 40 వేలు తగ్గని చంద్రబాబు మెజారిటీ 2019 ఎన్నికల్లో మాత్రం 30 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. దీంతో అప్పట్లోనే చంద్రబాబు పనైపోయింది అంటూ ఎద్దేవా చేసిన వారు ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్న ఫలితం లేకుండా పోతోంది. పంచాయితీ ఎన్నికల అనంతరం చంద్రబాబు కుప్పంలో మూడు రోజులపాటు పర్యటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కుప్పం నేతలకు సలహా ఇచ్చారు. వైసీపీ పార్టీపై తిరుగుబాటు ఉద్యమం ఇక్కడనుంచి ప్రారంభం కావాలని కుప్పం ప్రజలను పార్టీ నేతలను కోరారు. అప్పటి ఫలితాలు తారుమారు కావడంతో చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా అక్టోబర్ మాసంలో మరోమారు కుప్పంలో పర్యటించారు. పార్టీ కార్యకర్తలతో పాటు కుప్పం ప్రజలను చైతన్య పరిచేలా ప్రసంగం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో టీడీపీ పార్టీ తమగెలుపు తధ్యమని భావించింది.
ఐతే కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంట్రీ తో మొత్తం సీన్ రివర్స్ అయింది. ఎలాగైనా చంద్రబాబు కంచు కోటను కూల్చివేయాలన్న సీఎం జగన్ పట్టుదల, పెద్దిరెడ్డి రాజకీయం కుప్పంలో గెలుపుకు నంది పలికింది. చంద్రబాబు పర్యటన అనంతరం కుప్పంలో పాగావేసిన పెద్దిరెడ్డి.., నిత్యం ఎన్నికల వ్యూహంపైనే ద్రుష్టి సారించారు. లోకేష్ తో సహా పలువురు ముఖ్య నేతలు టీడీపీ తరపున ప్రచారం చేసినా తనదైన మ్యాజిక్ తో టీడీపీని చావు దెబ్బ కొట్టారు.
కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో 25 వార్డులు ఉండగా అందులో 19 స్థానాలు వైసీపీ కైవసం కాగా.... 6 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఇక కుప్పంలో ఓటమి ఎరుగని సూర్యుడికి అస్తమించే సమయం ఆసన్నం అయిందని వైసీపీ నాయకులూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, Peddireddy Ramachandra Reddy, TDP, Ysrcp