GT Hemant Kumar, Tirupathi, News18
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu-2021) వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నా.. సకల పూజా క్రతువులు సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి నిర్వహించే సేవలపై భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవారికి సేవలో అత్యంత ప్రముఖమైనది సుప్రభాత సేవ (Suprabhathaseva). తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం నిర్వహించే తొలి ఉత్సవం సుప్రభాత సేవ. ఆనంద రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారికీ నిర్వహించే మేలుకొలుపు సేవకు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేక పద్దతిలో నిర్వహిస్తారు. మేలుకొలుపు సేవను సుప్రభాతం అని ఎందుకు పిలుస్తారు...? శ్రీ వేంకటేశ్వరుని మేలుకొలుపు చేసే సేవనే సుప్రభాత సేవగా పిలుస్తారు. సుప్రభాతం అంటే శుభోదయం అని అర్థం... స్వామి వారు మేల్కొంటే భక్త కోటికి శుభం కలుగుతుందని మరో అర్థం. 1979 మార్చ్ 1వ తేది నుంచి ఇప్పటి వరకు శ్రీవారికి వేకువజము 3 గంటలకు సుప్రభాత సేవను నిర్వహిస్తున్నారు. 1979 పూర్వం సుప్రభాత సేవను వేకువజాము ఉదయం 4 గంటల తరువాతే నిర్వహించే వారు.
శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవలో మొత్తం నలుగు ఘట్టాలు ఉంటాయి. అందులో మొదటిది సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామ అంటూ ప్రారంభమయ్యే సుప్రభాతంలో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. మొదటి శ్లోకంలో కౌసల్య పుత్రుడు రాముడికి, రెండవ శ్లోకంలో అడుగడుగు దండాల వాడైన గోవిందుడు, మూడు నాలుగు శ్లోకాలలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి, మిగిలిన 24 శ్లోకాలలో ఏడు కొండల వాడికి, వేంకటా చలపతికి, శేషాద్రి నిలయునికి, భక్త కౌసల్యున్ని స్తుతిస్తారు. చివరి శ్లోకంలో శ్రీ వేంకటేశ్వరుని భక్తులకు మోక్షం ప్రసాదించాలని కోరుతారు. సుప్రభాత సేవలో రెండవ ఘట్టం స్తోత్రం. ఈ స్తోత్రంలో మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలలో తమను రక్షించమని భక్తులు స్వామి వారి కటాక్షం పొందేందుకు శరణు కోరుతారు. మూడవ ఘట్టం ప్రపత్తి. ఇందులో మొత్తం 16 చరణాలు ఉంటాయి. మొదటి చరణంలో లక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ ప్రార్ధన చేస్తారు. మిగిలిన 15 చరణాల్లో శ్రీవారిని స్తుతిస్తు వేడుకుంటారు. సుప్రభాత సేవలో చివరి ఘట్టం మంగళ శాసనం. ఇందులో 14చరణాలు, 17 శ్లోకాలు ఉంటాయి. స్వామి వారిలో భక్తులు నీలం అయ్యేలా శ్రీవారిని ప్రార్ధిస్తారు అర్చక స్వాములు.
ప్రస్తుతం సామి వారికి నిర్వహించే సుప్రభాత శ్లోకాలను 15వా శతాబ్దంలో రచించారు మనవాళ మహా ముని శిష్యులైన ప్రతివాది భయంకర అణ్ణన్ రచించారు. 15 శతాబ్దం ముందు స్వామి వారికీ సుప్రభాతని శ్లోకం రూపంలో సేవను నిర్వహించినట్లు పురాణాల్లో ఎటువంటి ఆధారాలు లేవు. అప్పట్లో శ్రీవారి సుప్రభాత సేవను నిశబ్దంగానే నిర్వహించే వారనే అర్థం అవుతుంది. 15వ శతాబ్దంలో ప్రారంభించినట్లు చరిత్ర ఆధారాల్లో ఉన్నాయి. సుప్రభాత సేవ తరువాత ఆ దేవదేవునికి నవనీత హారతి ఇచ్చి, వెన్న చక్కెరను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నవనీత హారతిని బాబా హథీరామ్ జీ సమర్పించడంతో అప్పటి నుంచి మహంథులు నవనీత హారతి స్వామి వారికి సమర్పిస్తారు.
ఏడాదిలో 11 మాసాలు ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేలుకొలుపు సేవలను నిర్వహిస్తుంటే ధనుర్మాసంలో మాత్రం గోదాదేవి రచించిన తిరుప్పావైతో మేల్కొలుపు సేవను నిర్వహిస్తారు. గోదాదేవి రచించిన 30 పాశురాలను రోజుకొకటి చొప్పున నెల రోజుల పాటు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీ కృష్ణ స్వామి వారు శాయనిస్తారు. ధనుర్మాసంలో నిర్వహించే తిరుప్పావైలో జీయర్ స్వాములు, ఏకాంగులు, అర్చకులు మాత్రమే పాల్గొనారు. ఇలా స్వామి వారికీ వైభవంగా మేలుకొల్పు సేవను నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala brahmotsavam 2021, Tirumala Temple