తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి (Tirumala Tirupati Devastanam New Board) నియామకం పూర్తైంది. 25 మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) దాదాపు ఖరారు చేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy)తో చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సుదీర్ఘ కసరత్తు అనంతరం పాలకమండలి సభ్యులను ఎంపిక చేశారు. పాలకమండలిలో చోటు కోసం వందకు పైగా సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. వడపోతల అనంతరం సభ్యుల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఇందులో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమబెంగాల్ కు చెందిన వారికి చోటు కల్పించింది. పాలకమండలిలో 25 మందికి చోటు కల్పించిన ప్రభుత్వం.. 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా 75మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాలకమండలి సభ్యులుగా పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గోర్ల బాబురావు, మధుసూదన్ యాదవ్, పారిశ్రామిక వేత్త మై హోమ్ రామేశ్వరరావు, హేటిరో పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ ఎన్.శ్రీనివాసన్ వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్ కత్తాకి చెందిన సౌరభ్, డాక్టర్ కేతన్ దేశాయ్, కర్నాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్ రెడ్డి, శశిధర్, శంకర్, తమిళనాడు రాష్ట్రంలోని వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య పేర్లు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక పాలకమండలిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండలి టీటీడీ చరిత్రలో 52వది.
పాలకమండలి నియామకంపై ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా సీఎం జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తల నుంచి సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.