బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వాన బీభత్సం సృష్టించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలలను వాన ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నెల్లూరు (Nellore) నగరం పూర్తిగా నీట మునిగింది. అటు తిరుపతిలోనూ (Tirupathi) ఇదే పరిస్థితి నెలకొంది. కడప నగరాన్ని కూడా వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితులకు తక్షణ ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) అధికారులను ఆదేశించారు.
తిరుమల, తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశముండటంతో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే దారిని అధికారులు మూసివేసినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తున్నట్లు టీటీడీ భద్రతా విభాగం ప్రకటించింది.
పాపవినాశనం ఉధృతంగా ఉండటంతో అటువైపు వెళ్లే దారిని అధికారులు మూసివేశారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో భారీ వృక్షాలు నేలకూలాయి. కూలిన చెట్లను అటవీ శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గం వద్ద భారీ వృక్షం పక్కనే ఉన్న దుకాణాలపై కూలింది. చెట్టు కూలే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్, సత్యవేడు, చంద్రగిరి, గంగాధర నెల్లూరలో వాన దంచికొడుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు కోతకు గురవుతున్నాయి. దీంతో పలు రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏర్పేడు వద్ద స్వర్ణముఖి నది తీవ్రరూపం దీంతో కాజ్ వేపై నీరు ప్రవహిస్తోంది.
ఎడతెరిపిలేని వర్షం కారణంగా నెల్లూరు నగరమంతా పూర్తిగా నీట మునిగింది. నగరంలోని ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, బుజబుజ నెల్లూరుతో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానల ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 12కు పైగా మండలాల్లో దాదాపు 3,500 ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అటు కడప జిల్లాలోనూ వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉంది. భారీ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Floods, Heavy Rains, Nellore Dist, Tirupati, WEATHER