GT Hemanth Kumar, Tirupathi, News18
ప్రపంచంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయం కలిగించే అంశాలు కూడా ఉంటాయి. మనం ఊహించిన దానికంటే అనుకోని అనుభవాలే ఎక్కువగా ఎదురవుతుంటాయి. వేపచెట్టుకు పాలుకారడం, సాయిబాబా ఫోటో నుంచి విభూది రాలడం, వినాయకుడు పాలు తాగటం లాంటి మరెన్నో అప్పడప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ వింత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో చోటు చేసుకుంది. ఏకంగా అమ్మవారే ఓ ఇంట్లో వెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం బండకాడపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తికి వింత శబ్దాలు వినపడ్డాయి. ఇంట్లోని వడ్ల మూట నుంచి శబ్దాలు వినిపించడంతో ఆ మూటను తెరిచి చూడగా ఒక్కసారిగా వారు ఉలిక్కిపడ్డారు. ఓ వైపు షాక్.. ఓ వైపు ఆనందంతో ఊగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. బండకాడ పల్లికి చెందిన మురళి అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు నిద్రలో నుంచి మేల్కొన్నారు. ఎలాంటి అలికిడి లేకోవడంతో భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. కానీ ఆ శబ్దాలు రానురాను ఎక్కువకావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేఛారు. ఇల్లంతా గమనించగా వడ్ల మూట నుంచి శబ్దాలు రావడం గమనించారు.
వెంటనే ఆ మూటను తెరిచి చూసిన మురళి అతడి కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. ఆ మూటలో అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది. దీంతో వారికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. వెంటనే అమ్మవారి విగ్రహాన్ని బయటకుతీసి పూజలు చేయడం మొదలుపెట్టారు. తెల్లారేసరికి విషయం ఆ నోటా.. ఈనోటా ఊరంతా తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు.
మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో తనను ఎవరో పిలిచినట్లు అనిపించడంతో నిద్రలేచానని.. నేను వడ్ల మూటలో ఉన్నాను వచ్చి పూజలు చేయమని అమ్మవారు చెప్పిందని.. వెంటనే వెళ్లి చూస్తే అక్కడే ఉందని మురళీ చెప్పాడు. అప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తున్నామన్నారు. తామే అమ్మకు అన్ని జరిపిస్తామని వెల్లడించారు.
ఇది చదవండి: ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..? ఎవరెంత చెల్లించాలంటే..!
తమ గ్రామంలో అమ్మవారు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం అమ్మారు గ్రామంలో వెలియడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు అమ్మవారు వెలిసిన చోటే గుడికట్టించి పూజలు చేస్తామని కూడా చెబుతున్నారు. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నారు. ఐతే దీనిపై స్థానిక అధికారులు ఎవరూ స్పందించలేదు. స్థానికులు మాత్రం తమ ఊరికి అమ్మవారు వచ్చిందని సంబరపడిపోతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Hindu Temples