తమిళనాడులో (Tamilnadu) కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన (Army Helicopter Crash) ఘటనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసి కూడా మృతి చెందారు. చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన జవాన్ సాయి తేజ.. ప్రమాదంలో మరణించారు. సాయితేజ సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేస్తున్నారు. 1994లో జన్మించిన సాయితేజ.. 2013లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సాయితేజకు భార్య శ్యామల.. మూడేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది వినాయక చవితికి ఇంటికి వచ్చిన సాయితేజ.. ఈ ఉదయం భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయితేజ మరణంతో కులబలకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రస్తుతం సాయితేజ కుటుంబం మదనపల్లెలో నివాసముంటోంది. సాయితేజ మరణించారన్న వార్త తెలుసుకొని బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. తన భర్త ఇక లేడన్న వార్తను తలచుకొని సాయితేజ భార్య శ్యామల శోకసంద్రంలో మునిగిపోయారు.
తమిళనాడులోని జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ఆర్మీకి చెందిన MI-17 V5 హెలికాఫ్టర్ లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.
ఘటనలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ను కొనఊపిరితో ఉండగా స్థానికులు, ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఐతే ప్రమాదంలో రావత్ శరీరం 80శాతం కాలిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బిపిన్ రావత్ మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బిపిన్ రావత్ అసలు సిసలు దేశభక్తుడని శ్లాఘించారు. జనరల్ రావత్ గొప్ప ప్రతిభాపాటవాలుగల సైనికుడని, భారత సాయుధ దళాలను, భద్రతా ఉపకరణాలను ఆధునికీకరించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని మోదీ గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Army, Chittoor