GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
మందుబాబుల నోట్లో చుక్కపడితే చాలు స్వర్గం కనిపిస్తుంది. రెండు పెగ్గులు ఎక్కువైతే ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి భాషలు మాట్లాడేస్తారు. ఒకవేళ ఫుల్ బాటిల్ లాగించారా..! అంతేసంగతులు ప్రపంచానికి తామే రారాజులని ఫీలవుతారు. ఆ సమయంలో వారికి ఎవరు అడ్డు చెప్పినా వారి మీద తిట్లదండకం ఎత్తుకోవడమే కాదు కొట్టడానికి కూడా వెనుకాడరు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో చాల వరకు మందుబాబులు, పీకల దాకా తగిన యువతుల హైడ్రామా చూశాం. కానీ మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని విని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..! చేతిలో ఫుల్ బాటిల్ తో పాటు తన వెంట తెచ్చుకున్న బ్యాగులో ఏముందో చూసి ఎవరైనా భయపడేలా చేశాడు ఆ వ్యక్తి. ఆ బ్యాగులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 నాటు బాంబులతో గ్రామంలో హల్ చల్ చేస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాడు. కిక్ సినిమాలో హీరో మాదిరిగా కిక్కు కోసం ఊరందరినీ పరుగులు పెట్టించాడు.
వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం వాల్లివేడు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉంది. రోజు మందు కొట్టడం ఎవరో ఒకరితో గొడవపడటం చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన కృష్ణయ్య.. స్థానికులతో గొడవపడ్డాడు. ఓ చేతిలో మందుబాటిల్.. మరో చేతిలో ఓ సంచిని తీసుకొని గట్టిగా అరుస్తూ విధుల్లో తిరుగుతున్నాడు. బయటకు రాకుంటే ఇళ్లపై బాంబులు వేస్తానంటూ బెదిరించడంతో అంతా పరుగులు పెట్టారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటుబాంబులు
అతడ్ని అడ్డుకునేందుకు యత్నించగా.. బాంబు చేతిలో పట్టుకొని వీరంగం సృష్టించాడు. దగ్గరికొత్తే బాంబు వేస్తానంటూ నానా హంగామా చేశాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఎవరిమాటా వినలేదు. చివరకు ఓ బాంబును విసరగా అది ఖాళీ ప్రదేశంలో పడి పేలింది. దీంతో జనమంతా భయంతో పరుగులుతీశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు అలేదు. కృష్ణయ్య ప్రవర్తన మితిమీరడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగిలోకి దిగిన పాకాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే కృష్ణయ్య అక్కడి నుంచి పారిపోయాడు. బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కృష్ణయ్య కోసం గాలిస్తున్నారు. అసలు గ్రామంలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి..? ఎవరు తీసుకొచ్చారు..? వన్యప్రాణులను వేటాడేందుకు తెచ్చారా..? లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణయ్య పట్టుబడితే నాటు బాంబుల వెనకున్న మిస్టరీ వీడుతుందని పోలీసులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Crime news