ప్రజల నమ్మకమే తాము చేసే మోసాలకు రాచబాటగా మార్చుకుంటారు కొందరు మాయగాళ్లు. డబ్బు సంపాదనే ధ్యేయంగా నమ్మినవాళ్లని నట్టేట ముంచుతున్నారు. తన మన బేధాలు లేకుండా నమ్మకాన్ని పెట్టుబడిగాపెట్టి అందినకాడికి దోచుకొని పరారవుతున్నారు. ఇలా చుట్టుపక్కలవారిని నమ్మించిన కిలాడీ దంపతులు భారీగా డబ్బు వెనకేసుకొని ఉడాయించారు. అంతేకాదు తమ ఆస్తులను కూడా అమ్మేసి ఎంచక్కా చెక్కేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ లో నివాసం ఉంటున్నా శ్రీనివాసులు అనే వ్యక్తి ఓ ఫైనాన్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అక్కడికి వచ్చే వారికి చిన్న చిన్న పనులు చేస్తూ.., ఎంతో నమ్మకంగా ఉండే వాడు. అందరితోనూ స్నేహంగా మెలిగేవాడు. ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని వారికి చెప్పేవాడు. దీంతో ఫైనాన్స్ కోసం వచ్చే ఖాతాదారులకు శ్రీనివాసులపై బాగా నమ్మకం కుదిరింది. ఆ నమ్మకాన్నే సొమ్ము చేసుకోవాలని చూసాడు శ్రీనివాసులు. తన భార్యతో కలసి ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. తనను బాగా నమ్మినవారి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవసరముందంటూ అందినకాడికి అప్పులు తీసుకున్నాడు.
కొందరి వద్ద నెలవారీ వడ్డీకి, మరికొందరి దగ్గర ఒకే సారి వడ్డీ అసలు చెల్లిస్తాననంటూ డబ్బు తీసుకున్నాడు. ఇంకొందరి దగ్గరైతే కొత్తగా ఇల్లుకడుతున్నానని.. నిర్మాణం పూర్తవగానే దాన్ని విక్రయించి డబ్బులిస్తానంటూ ముగ్గులోకి దింపాడు. కొందరికి కొన్ని నెలల పాటు వడ్డీ కూడా చెల్లించాడు. ఇంకొందరి వద్ద రోజు, వారం చెల్లింపు క్రింద నగదు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరికి దగ్గర తన ఇంటి పత్రాలను కలర్ జిరాక్స్ తీసి అవే ఒరిజినల్ డాక్యుమంట్స్ గా నమ్మించాడు. కోటికిపైగా సొమ్ము పోగు కావడంతో ఊరొదిలి భార్యతో సహా పరారయ్యాడు.
విషయం తెలిసుకున్న వందలాదిమంది బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులను ఆస్రయించారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా అతని ఇంటిని స్వాధీన పరచాలని పోలీసులను కోరారు. ఇలా 40 వరకు కంప్లైంట్ ఇవ్వడంతో వారు ఇచ్చిన పత్రాలు నకిలీవి అని.., నిజమైన పత్రాలతో వేరొకరికి అమ్మేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. నెల రోజుల క్రితం ఆ ఇంటిని 26 లక్షల రూపాయలకు విక్రయించినట్లు నిర్ధారించారు. వడ్డీలకు తీసుకున్న 60లక్షలు, చిట్టీల ద్వారా 20 లక్షలు, రోజు వారం తండల్ ద్వారా మరో 20 లక్షలు కాజేసినట్లు, వందల మందు బాధితుల దగ్గర నుంచి పిర్యాదు అందినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.