TIRUPATI CHITTOOR GOVERNMENT HOSPITAL DOCTORS SHOWS NEGLIGENCE TOWARDS BOY WHO IS IN DANGER FULL DETAILS HERE PRN TPT
Chittoor News: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ల తీరు మారదా..? ప్రాణాలు పోయినా అంతేనా..?
చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం
AP Government Hospitals: వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. ప్రాణాలు కాపాడే వారిని దేవుడితో పోలుస్తాం. కానీ ఇలాంటి వైద్య వృత్తిలోనూ కొందరు రాక్షసులు ఉంటారని కొన్ని ఘటనలతో రుజువవుతుంది.
వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. ఆరోగ్యం క్షీణించి కాపాడాలని అంటూ వైద్యుల దగ్గరకు వెళ్తాము. నారాయణుడిలా వైద్యం చేసి ప్రాణ దాతగా మారుతాడు వైద్యుడు. అందుకే వైద్యుడ్ని దేవునితో పోల్చారు పెద్దలు. వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఇలాంటి వైద్య వృత్తిలోనూ కొందరు రాక్షసులు ఉంటారని కొన్ని ఘటనలతో రుజువవుతుంది. వైద్యం కోసం పేదవాడు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యనికి బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District), గంగాధరనెల్లూరు మండలం, నెల్లెపల్లెకు చెందిన బాలాజీ, అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు నాలుగేళ్ళ కుమారుడు రాకేష్ ఉన్నాడు.
బాలాజీ కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తనకేదైనా కొనివ్వాలని రాకేష్.. తండ్రి వద్ద మారం చేశాడు. దీంతో అరుణ.. రాకేష్ కు ఐదు రూపాయల కాయిన్ ఇచ్చి ఏమైనా కొనుక్కోమని చెప్పింది. అమ్మ డబ్బులివ్వడంతో ఆనందంతో పరుగులు పెట్టిన రాకేష్.. స్నేహితులతో ఆడుకుంటూ ఐదు రూపాయల బిళ్లను మింగేశాడు.
ఇది చూసిన స్ధానికులు విషయం రాకేష్ తల్లిదండ్రులకు చెప్పి, బాలుడు నోటిలో నుండి నాణెం తీసేందుకు ప్రయత్నించారు. కానీ నాణెం బయటికి రాక పోయే సరికి ఆందోళనకు గురైన రాకేష్ తల్లిదండ్రులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అదే సమయానికి డాక్టర్లు ఆస్పత్రిలో లేరు. చాలాసేపటి తర్వాత వచ్చిన డాక్టర్లు స్కానింగ్ తీయించుకురావాలని సూచించారు. ఐతే ఆస్పత్రిలోని స్కానింగ్ విభాగంలోనూ సిబ్బంది అందుబాటులో లేరు. విషయం డాక్టర్లకు చెప్పగా స్కానింగ్ తీసిన తర్వాతే వైద్యం చేస్తామని స్పష్టం చేశారు.
స్కానింగ్ సెంటర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో చాలా సేపటి తర్వాత వచ్చి స్కానింగ్ తీశారు. తీరా రిపోర్ట్స్ తీసుకొని హడావిడిగా డాక్టర్ వద్దకు పరుగులు పెట్టగా.. బాలుడి గొంతులోని కాయిన్ తీయడం ఇక్కడ కుదరదని.. తిరుపతి గానీ, వేలూరు సీఎంసీకీ గానీతీసుకెళ్లాలని సాఫీగా సలహా ఇచ్చారు.
డాక్టర్ చెప్పిన మాటలతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. ఓ వైపు తమ బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. ఆలస్యం చేయడమే కాకుండా సలహాలిస్తారా అంటూ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. చేసేది లేక బంధువుల సాయంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల హాజరు విషయంలో పక్కాగా ఉంటామని.. డ్యూటీ టైమ్ లో ఆస్పత్రిలో లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. కానీ డాక్టర్లు మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ మోజులో పేద ప్రజలకు సమయానికి వైద్యం అందిచడం లేదు. జనం ప్రాణాల మీదకు వస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.