GT Hemanth Kumar, Tirupathi, News18
Tension in Tirupati: అది అటవీ ప్రాంతం.. అందులోనూ చిరుతల ఆవాసాల కేంద్రం. దాదాపు 40 నుంచి 50 పైగా చిరుతలు శేషాచలానే ఆవాసంగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. సరైన ఆహారం అందకపోవడం.. జనావాసాల్లో ఉన్న వీధి కుక్కల కోసం మాటు వేసి రాత్రి సమయాల్లో ఆ ప్రాంతంలో సంచరిస్తూ.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకప్పటి అటవీ ప్రాంతం అయినా ఇప్పుడు అదే పేదల పాలిట అవాస ప్రాంతం. జీవ లింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని జీవకోనలో భాగంగా ఉన్న బీడీ కాలనీ.. బ్యాంక్ కాలనీలో చిరుతలు ఆగడేలేత్తిస్తున్నాయి. ఆరు దాటిందంటే.. బయటకు వచ్చే సాహసం చేయడం లేదు ఇక్కడి ప్రజలు. అత్యవసరాల్లో బయటకు వెళ్లాలన్న ఒళ్లంతా వణుకుతూ చిరుత ఎక్కడా దాడి చేస్తుందో అంటూ బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి.
చిరుత పులి సంచారం తిరుపతి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. తిరుపతి నగరంలోని వెటర్నరీ యూనివర్సిటీ, జీవకోన ప్రాంతాల్లో తరచూ చిరుత పులి సంచారం స్ధానికులకు, విద్యార్ధులకు వణుకు పుట్టిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు శేషాచలం అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ఆహార సేకరణకు చిరుత పులులు జన నివాసాలకు వస్తున్నాయి.
ఇక జీవకోనలోని ఎల్.ఎస్.నగర్, బ్యాంక్ కాలనీ, మొండికోన, బీడీ కాలనీలో ప్రజలు చీకటి పడితే ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలను వేటాడేందుకు అటవీ ప్రాంతం నుండి నివాసాలకు వస్తున్న చిరుత పులిని చూసిన కుక్కల అరుపులకు నిద్ర లేకుండా కాలం గడుపుతున్నారు. మనుషులపై చిరుత పులి దాడి చేయకున్నా.. చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉండడంతో స్ధానికులు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే చిరుత పులి సంచారాన్ని.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.
ఇదీ చదవండి : మోదీ ప్లాన్ వర్కౌట్ అవుతోందా..? చిరంజీవి వ్యాఖ్యలకు కారణం అదేనా..?
ఆ సీసీ కెమెరాల పుటేజ్ ను అటవీ శాఖా అధికారులు చూపించి తమను కాపాడాలంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. కానీ అటవీ శాఖ చట్టం ప్రకారం ఆ ప్రాంతాల్లో కంచె వేసేందుకు వీలు లేదని అధికారులు చేతులు దులుపుకోవడంతో దిక్కు తోచని స్ధితిలో స్ధానికులు ఉన్నారు. చిరుత పులి సంచారంపై తమకు భధ్రత కల్పించాలని, అటవీ ప్రాంతం దగ్గర బోన్లు, కంచె ఏర్పాటుతో పాటు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరుతున్నారు. తమపై దయ ఉంచి... చిరుత నుంచి నుంచి కాపాడాలని కోరుతున్నారు. అయితే ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించక పోవడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tiger, Tirupati