TIRUPATI BRIDE ESCAPE LAST MINUTE BEFORE MARRIAGE IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Bride Escape: కాసేపట్లో పెళ్లి.. వధువు జంప్.. పోలీస్ స్టేషన్ కు మారిన సీన్.. అసలేం జరిగిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం
Twist Before Marriage: కాలేజీలో చదువుతున్న సమయంలోనే సోనిక చరణ్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు సమాచారం. వీరి ప్రేమాయణం సంగతి తెలిసే తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు.
పెళ్లి (Marriage) అంటే రెండు జీవితాల కలయిక. ఇద్దరు వేర్వేరు వ్యక్తులను ఒకటి చేసే పవిత్రమైన కార్యక్రమం. గతంలో పెద్దలు నిశ్చయించిన వారినే యువతీ యువకులు పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే చూపులు, నిశ్చితార్థాలు, ఫోటో షూట్లు, సినిమాలు, షికార్లు అంటూ సందడి చేస్తారు. ఒకరి ఇష్టాఇష్టాలు ఒకరు పంచుకొని పెళ్లి పీటలెక్కుతారు. ఇలా పెద్దలు ఓ జంటకు పెళ్లి కుదిర్చారు. పెళ్లి చూపులయ్యాయి. ఘనంగా నిశ్చితార్థం జరిగింది. షాపింగ్ పూర్తైంది. శుభలేకలు ప్రింట్ అయ్యాయి. పెళ్లికి ముందు రిసెప్షన్ కూడా ముగిసింది. కాసేపట్లో పెళ్లనగా.. సినీ ఫక్కీలో పెద్ద కేక. పెళ్లి కూతురు కనిపించడం లేదని. అప్పటివరకు మోగుతున్న మంగళవాయిద్యాలు ఒక్కసారిగా మూగబోయాయి. అమ్మాయి తరపు బంధువులు టెన్షన్ తో కల్యాణ్ మండపమంతా వెతికేస్తున్నారు. అబ్బాయికి మాత్రం ఏం జరిగిందో తెలియని గందరగోళం. కట్ చేస్తే పెళ్లి కూతురు వేరే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకొని ట్విస్ట్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) మందనపల్లె రూరల్ మండలం తట్టివారిపెళ్లికి చెందిన రామకృష్ణ-మల్లిక దంపతుల కుమార్తె సోనికకు మదనపల్లె పట్టణానికి చెందిన నవీన్ అనే యువకుడితో పెద్దలు పెళ్లి కుదుర్చారు. పెళ్లికి ముందే రెండు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చడంతో నిశ్చార్థం చేసి ఈనెల 14న తెల్లవారుజామున పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. శనివారం రాత్రి మదనపల్లె పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో వధూవరులిద్దరికీ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు.
రిసెప్షన్ ముగిసిన తర్వాత తన రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయిన పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. దీంతో వరుడుతో పాటు అతడి బంధువులు షాక్ కు గురయ్యారు. తమకు అవమానంగా భావించిన అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే అమ్మాయి పారిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే సోనిక చరణ్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు సమాచారం. వీరి ప్రేమాయణం సంగతి తెలిసే తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేకనే ముహూర్తం వరకు మౌనంగా ఉన్న సోనిక.. పెళ్లికి మండపం నుంచి వెళ్లిపోయింది. పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి 2గంటల ముందే తాను ప్రేమించిన చరణ్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. అనంతరం ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది.
ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పెళ్లికి రెండు గంటల ముందు చెప్పుల కోసమని వెళ్లి పారిపోయాడు. పెద్దలు అతడ్ని పట్టుకొచ్చి నిలదీయగా పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశారు. గతంలో విశాఖలో ఓ యువతి పెళ్లికి గంట ముందు డయల్ 100కు ఫోన్ చేసి చివరి నిముషంలో పెళ్లిని తప్పించుకుంది. ఆ తర్వాతి రోజు తాను ప్రేమించిన వ్యక్తితో తాళికట్టించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.