GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
తిరుమల కొండలు. ఎటుచూసినా పచ్చదనం.. గోవింద నామస్మరణతో ప్రశాంతంగా ఉంటాయి. తిరుమలకు వెళ్తే ఆ ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోవాల్సిందే..! వన్యప్రాణుల సందడి, జలపాతాల సవ్వడులు అలరిస్తుంటాయి. ఇదంతా ఒకవైపే.. మరోవైపు నిత్యం తిరుమలకు వచ్చే వాహనాలతో సప్తగిరులను కాలుష్యం కమ్మేస్తోంది. శేషాచలంలోని పచ్చదనానికి, ప్రకృతి సౌదర్యానికి వాయుకాలుష్యం సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి చెంత కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అడుగులు వేస్తోంది. తిరుమల కొండలను జీరో కార్బన్ ఎమిషన్ జోన్‌గా మార్చే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో నడపనుంది. పచ్చదనం ప్రకృతి శోభ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిత్యం పరిశుభ్రతలో అలరాడే తిరుమల గిరులు ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. ప్రతిరోజు సుమారు పది వేలకుపైగా వాహనాలు తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసీ కూడా భక్తుల సౌకర్యార్ధం తిరుమలకు బస్ సర్వీసులను నడుపుతోంది.
ఐతే భక్తుల సౌకర్యం సంగతి అటుంచితే. తిరుమల ఘాట్ రోడ్లలో రాకపోకలు సాగించే వాగనాలతో సప్తగిరులు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులది కూడా ప్రధాన పాత్ర ఉంది. వేలాది మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు తీసుకెళ్లి మరలా తిరుపతికి చేరవేస్తుంటారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యత ఇస్తుంటారు. స్థానికంగా నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలతో పాటు సొంత వాహనాలపైన వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. నిత్యం వేలాది వేలాది వాహనాలు వస్తుండటంతో వాటి నుండి లువడే పొగ కాలుష్యం వల్ల పచ్చని తిరుమలగిరులతో పాటు శ్రీవారి చెంత నివసించే వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణ రోడ్ల మీద వీటి నుండి వెలువడే కాలుష్యం అంతగా తెలియకపోయినా తిరుమల ఘాచ్ రోడ్లలో మాత్రం ప్రమాదకర వాయువుల జాడ ఇట్టే కనిపెటవచ్చు.
తిరుమలకు కాలుష్యం వెదజల్లే వాహనాలు రాకపోకలు సాగిస్తే భవిష్యత్తులో తిరుమల గిరులకు ప్రమాదం ఉందని నిపుణులు గతంలోనే తేల్చారు. దీంతో కాలుష్యం వేదజల్లే బస్సులకు చెక్ పెట్టి కాలుష్యరహిత వాహనాలు వినియోగానికి శ్రీకారం చుట్టారు టిటిడి అధికారులు. అందులో భాగంగా గత కొన్ని రోజులకు ముందు అధ్యాయన పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అంతా బాగుంటే త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఘాట్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
తిరుమలను కాలుష్యరహితంగా తీర్చి ద్దేందుకు గత రెండు నెలల క్రితం వారం రోజుల పాటు ఒక ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా నడిపారు. అశోక్ లేలాండ్ సంస్థ 32 మంది ప్రయాణికులకు సరిపడా ఈ ఎలక్ట్రికల్ బస్సును రూపొందించింది. ఈ బస్సును నడిపేందుకు అధికారులు అను అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్ లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో తిరుమల ఘాట్ రోడ్లలో తొలిసారిగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు దూసుకెళ్లనున్నాయి. తిరుమలకు నిత్యం వచ్చే డీజిల్ బస్సుల స్థానంలో విడతల వారీగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి.
తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు కూడా ఈ ఎలక్ట్రానిక్ బస్సులు నడపాలని భావించింది ఆర్టీసీ. అయితే ముందుగా తిరుమలలో ఇవి ట్రైల్ రన్ చేసి ఆ తరువాత మిగిలిన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలనేది ఆర్టీసీ అధికారుల ఆలోచన. ప్రస్తుతానికి తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు టెండర్లు ఖరారయ్యాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు వెల్లడించారు. ఆర్టీసీ నుంచి తొలి ఎలక్ట్రికల్ బస్సులు తిరుమలకు రాబోతున్నాయన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే త్వరలో సర్వీసులు మొదలవుతాయని ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Electric Vehicle, Tirumala tirupati devasthanam