ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరదలకు అతలాకుతలమైన కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరు గ్రామంలో జగన్ పర్యటించారు. కాలినడకన గ్రామంలో కలియదిరిగిన సీఎం జగన్.. బాధితులతో నేరుగా వెళ్లి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు వరదసాయం అందలేదని ఐదు కుటుంబాలు జగన్ కు విన్నవించుకున్నాయి. వెంటనే కలెక్టర్ తో మాట్లాడిన సీఎం సాయంత్రానికల్లా డబ్బులు వస్తాయని.. ఒకవేళ రాకపోతే ఈ నెంబర్ కు కాల్ చేయాలంటూ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని తానున్ననానని భరోసా ఇచ్చారు. ఓ మహిళ వద్ద ఉన్న పసికందును ఎత్తుకొని ఆడించిన సీఎం.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల్లో అధికారులు చక్కనిపనితీరు కనబరిచారని సీఎం అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. వరద బాధితులను అన్నిరకాలుగా అండగా ఉంటామని హమీ ఇచ్చారు. రేపటి నుంచే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. పనులు లేకపోవడంతో వారు నెలసరి వాయిదాలు చెల్లించే పరిస్థితుల్లో లేరన్నారు. వారికి ఉపశమనం కలిగించేలా మంచి నిర్ణయం తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఐతే డ్వాక్రా మహిళలకు రుణంపై ఏడాది మారటోరియం ఇస్తారని తెలుస్తోంది. ఈ కాలంలో వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించే ఏర్పాటు చేయనునట్లు సమాచారం.
ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తామని.. ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలిచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చదువుకున్నవారికి ఉపాధి కల్పించేలా రుణాలిచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇచ్చే ఆర్ధిక సాయం రూ90వేలు సరిపోవని బాధితులు చెప్పడంతో.. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు. వరద ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తామని జగన్ తెలిపారు. అంతకుముందు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయిన ప్రాంతాన్ని సీఎం జగన్ పరిశీలించారు. కట్టను నిర్మించే అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ శుక్రవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Kadapa