GT Hemanth Kumarn, Tirupathi, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ పదవుల (MLC Elections) కేటాయింపు ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అన్నిస్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఖాతాలో చేరనుండటంతో పార్టీ కోసం పనిచేసిన వారికి పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy). రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్యేల కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకు స్థానం దక్కింది. నంద్యాలకు చెందిన ఇసాక్ బాషా, బద్వేలు వైసీపీ ఇన్ ఛార్జ్ దేవాసాని చిన్న గోవింద రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీకి విధేయతతో పాటు తమ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికీ ఈ పదవులు వరించాయి. జగన్ గతంలో ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నారు. నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా ఇసాక్ బాషా వ్యవహరిస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రిందట మార్కెట్టు యార్డు చైర్మన్ స్థానాన్ని మైనారిటీలకు రీసర్వేడ్ చేయడంతో పదవి దక్కించుకున్నారు.
మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి అనుచరుడిగా పేరొందిన ఇసాక్ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఇక వైసీపీ పట్టణాధ్యక్షుడుగా కొంతకాలం పనిచేసారు. ఇప్పుడు మైనారిటీ విభాగం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఇసాక్ కు ఇచ్చిన మాట నేడు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం లభించింది. నంద్యాల శాసన సభ స్థానానికి 2017లో ఉప ఎన్నిక జరిగింది. అదే సమయంలో జగన్ ప్రచారానికి వెళ్లారు. జగన్ ఇసాక్ తో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి మైనార్టీకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బద్వేల్ పార్టీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు దేవసాని చిన్న గోవింద రెడ్డి. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగాను., జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. రోడ్డు రవాణా సంస్థకు ఉప కమీషనర్ గా సేవలు అందించిన చిన్న గోవిందరెడ్డి.., 2001లో రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయ అరంగ్రేట్రం చేసారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గం ఎస్సీ రిసర్వ్డ్ కావడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2014. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జయరాములు గెలుపుకు అన్ని తానై నియోజకవర్గంలో చక్రం తిప్పి వైసీపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేసారు. బలమైన సామాజికవర్గ నేత కావడం., నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు ఉండటంతో బద్వేల్ ఎమ్మెల్యే టిక్కెటుని ఎవరికీ కేటాయించాలో నిర్ణయించే స్థాయికివచ్చారు.
దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య పేరును ఖరారు చేయించారు. ఆయన గెలుపుకు సైతం కృషి చేశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వెంకట సుబ్బయ్య సతీమణి సుధా దాసరికి టిక్కెట్టు ఖరారు చేయగానే చిన్న గోవింద రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట జగన్. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుపొందిన అనంతరం ఎమ్మెల్యేల కోటాలో చిన్న గోవింద రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap mlc elections, Ysrcp