ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపతి (Tirupathi) లో ఊహకు కూడా అందని ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వరద సృష్టించిన విలయంతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గి వరదల నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విలయం నుంచి కోలుకుంటున్న తరుణంలోనే తిరుపతిలో చోటు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. జనాల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో భూమిలో వింత ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం భూమిలో నుంచి వాటర్ ట్యాంక్ బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వింత జరగడానికి కారణలేంటని జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.
తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఎప్పుడు ఏ జరగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంకా జనం ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఊహించని పరిణామం ఎదురైంది. శ్రీకృష్ణనగర్లో వాటర్ ట్యాంక్ పైకి వచ్చిన ఇంటికి సమీపంలోని ఇంట్లో భూమి కుంగింది.
కొన్ని ఇళ్లలో మెట్లు రెండు అడుగులు భూమిలోకి వెళ్లాయి అలాగే గోడల కింద భూమి కూడా కిందకు దిగింది. ఇంట్లో టైల్స్ కూడా పగిలిపోతున్నాయి. ఇలా దాదాపు 20 ఇళ్లలో గోడలు బీటలువారడంతో పాటు అక్కడక్కడా కుంగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు వచ్చి పరిస్థితిని వివరిస్తే తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్తామంటున్నారు.
గురువారం శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంట్లో మహిళ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. అది ఒక్కసారిగా భూమి నుంచి పైకి వచ్చింది. ఆందోళనతో మహిళ కేకలు వేయగా.. ఆమె భర్త బయటకు వచ్చి చూసేసరికి వాటర్ ట్యాంక్ పైకి వచ్చింది. మొత్తం 18 ఒరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ 11 ఒరల మేర బయటకు వచ్చింది. భూమిలో నుంచి నిటారుగా బయటకు వచ్చిన వాటర్ ట్యాంక్ ను చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది.
దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.., ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో జరగటం ఇదే తొలిసారని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. దీనివల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati, Tirupati Floods