GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
ప్రకృతి విపత్తులను నిలువరించడం.. వాటిని రాకుండా అడ్డుకోవడం మానవులకు అసాధ్యం. కానీ ఆ విపత్తులను ముందే పసిగట్టగలిగితే కాస్త అప్రమత్తమైతే జరిగే భారీ నష్టంలో కొంత మేర కట్టడి చేయడానికి సాధ్యం అవుతుంది. ముఖ్యంగా వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయడం చాల కష్టం. జోరుగా వర్షం కురిసినా.., బలమైన గాలులు వీచినా సామాన్య ప్రజలకన్నా... రైతులు, మత్స్య కారులకు తీవ్ర నష్టం మాత్రం తప్పదు. ఇదే అంశంపై వాతావరణ శాఖా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. అయితే వాతావరణ పరిస్థితులు రైతులు, మత్స్య కారులు, సామాన్య ప్రజలకు అవగాహన ఉంటే చాల ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వాతారణాన్ని అర్ధమైయ్యే రీతిలో చెప్పే వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు 24 ఏళ్ళ సాఫ్ట్ వెర్ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేరుతో సంచలనంగా మారాడు. సోషల్ మీడియాలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాడు ఈ సూపర్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ గా సేవలు అందిస్తున్న సాయి ప్రణీత్ కు అసలు ఈ ఆలోచన ఇప్పుడేం వచ్చింది కాదట. తాను టెంపుల్ సిటీ తిరుపతిలో జన్మించడం, చుట్టూ కొండలు.., ఆ కొండలను తాకుతూ వెళ్లే మేఘాలను చూస్తూ చిన్ననాటి నుంచే ఎంతో ఆనందించే వాడట. వయస్సు పెరిగే కొద్ది వాతావరణ పరిస్థితులపై అవగాహనా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ, సమాచారాన్ని సేకరించే వాడు. ఇక కాలేజీ చదివే రోజుల్లో అతనికి తల్లితండ్రులు మొబైల్ కొనిచ్చారు. దాంట్లో ఉండే వెదర్ యాప్ అతనిని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయి..? సమాచారాన్ని ఎలా సేకరిస్తాయి..? అనే విషయాలు తెలుసుకోవాలని తాపత్రయపడుతుండేవాడు.
ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ?? వివరంగా ఈ వీడియోలో. pic.twitter.com/z4N04bHAAw
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) July 8, 2021
గతంలో చేసిన ఎన్నో పరిశోధనలు, మరెన్నో పుస్తకాలు చదివేవాడు. తన లాంటి ఆసక్తి కలిగిన మిత్రులను ఎంచుకొని ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక బిటెక్ సమయంలో వాతావరణంలో మార్పులను గమనిస్తూ వాటిని అంచనా వేయసాగాడు. వాతావరణంపై అప్పటికే పరిశోధనలు ప్రారంభించిన 'తమిళనాడు వెదర్ మ్యాన్' తో పరిచయం తన మార్గాన్ని నిర్ధేశించింది. కొన్ని సంవత్సరాల శ్రమకు ఫలితంగా ఓ బ్లాగ్ ను ఏర్పాటు చేసాడు. తద్వారా వాతావరణ స్థితిగతులపై తన అంచనాను మొదలెట్టాడు సాయి ప్రణీత్.
ఇతను ప్రారంభించిన బ్లాగ్ ద్వారా రోజువారీ వాతావరణ పరిస్థితులపైనే కాకుండా, తుఫాను గండాన్ని కూడా ముందే పసిగట్టాడు. 2020 అక్టోబర్ లో తెలుగు రాష్ట్రాలను వర్షం కుదిపేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కు ముప్పు పొంచి ఉందని ముందే పసిగట్టిన సాయిప్రణీత్... తన బ్లాగ్ లో పోస్ట్ చేసాడు. తాను చెప్పినట్లే తుఫాను హైదరాబాద్ నగరాన్ని గజగజ వణికించింది. ఇక ఆ ట్వీట్స్ కాస్త వైరల్ అయ్యాయి. అటుతరువాత వచ్చిన నివర్ తుపాను ప్రభావంపై ముందుగానే జోస్యం చెప్పాడు. అతను చెప్పిన అంచనాలనే నిజమయ్యాయి.
ఇక తాను నడుపుతున్న ఏపీ వెదర్ మ్యాన్ లో పెట్టె ప్రతి పోస్టు, ప్రతి అప్ డేట్ లు కచ్చితంగా జరుగుతున్నాయి. నిజానికి వెదర్ రిపోర్ట్ ఇవ్వడం అంత ఆషామాషి పని అయితే కాదు. ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయడం చాల కష్టం. అందుకు మానవ మేధస్సుతో పాటుగా అంతరిక్ష్యంలో ఉపగ్రహాలు పంపే సమాచారం ఆధారారంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణ సూచనలను నిపుణులు తెలియజేస్తారు. ప్రణీత్ ముందుగా అలంటి అంశాలను తీసుకొని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సమాచారాన్ని సేకరించి వాతావరణ సూచనలను ఖచ్చితంగ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. దీనికోసం డబ్బులు ఖర్చుపెట్టి సమాచారంను సేకరిస్తారు.
అన్ని సమాచారాలను అనుసంధానం చేసి.., ప్రజలకు ఉపయోగ పడే అంచనాలు రూపొందిస్తున్నాడు. వర్షం, ఎండ, ఉరుములు, తుఫాను, ఉష్ణోగ్రత వివరాలను రోజువారీ అప్ డేట్ నుంచి నెల వారి అప్ డేట్ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్, ట్వీట్టర్, బ్లాగ్స్ లో పోస్ట్ చేస్తూ ప్రజలను, రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాడు. తుఫాన్, ఉరుముల సమయంలో ముందుగానే పసిగట్టి తన బ్లాగ్స్ లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇక సాయి ప్రవీణ్ బ్లాగ్ కు 1.20 లక్షల మంది, పేస్ బుక్ పేజ్ కు 28 వేల మంది, ట్విట్టర్లో 7 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
దీని గురించి సాయి ప్రణీత్ మాట్లాడుతూ.. "రోజువారీగా వెదర్ రిపోర్ట్ కొరకు 2 నుంచి మూడు గంటల పాటు పరిశోధనలు చేస్తున్న. వాటిని కచ్చితత్వంగా ప్రజలకు ఇవ్వాలనేది నా ఊద్దేశ్యం. ఈ సమాచారం అందించడానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నావంతు సాయం ప్రజలకు చేయాలనుకుంటున్నా. నా వెదర్ అప్‌డేట్స్‌తో జాగ్రత్తపడ్డామనీ, నష్టం నివారించగలిగామనీ ఎంతో మంది నాకు చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణ అంచనాలు మాకూ ఇవ్వమంటూ కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. త్వరలో అక్కడా ప్రారంభించబోతున్నా. ఇంకా భారీస్థాయిలో జనాలకు ఉపయోగపడేలా, తాజా సమాచారం అందించేలా ఒక యాప్ రూపొందించి మరింత సమర్థంగా సేవలు అందించాలనుకుంటున్నా” అని వివరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati, Weather report