తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu-2021) ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఐదవ రోజు శ్రీవారికి గరుడ వాహన సేవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6గంటల 20 నిముషాలకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు.. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పరివట్టం కట్టారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలను తీసుకెళ్లారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆనంతరం ఆలయంలో ఏకాంతంగా జరిగే గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, నారాయణ స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ అధికారులు ఉన్నారు.
తిరుమలకు రావడానికి ముందు సీఎం వైఎస్ జగన్ అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం గో మందిరాన్ని సీఎం పరిశీలించారు. గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది. తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించారు.
అంతకుముంది రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి చేరుకున్న సీఎం జగన్.. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రత్యేకతలపై రూపొందించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను సీఎం వీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని టిటిడి ఏర్పాటు చేసింది. టిటిడి బర్డ్ ఆసుపత్రిలో మొదటి దశలో 44,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.25 కోట్ల వ్యయంతో, 50 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
ఈ ఆస్పత్రిలో ఓపి బ్లాక్‌లో 5 కన్సల్టేషన్ గదులు, రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. రేడియాలజీ బ్లాక్‌లో ఎక్సరే రూమ్, క్యాథ్ ల్యాబ్, మరుగుదొడ్లతోపాటు రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు జరిగాయి. 15 పడకలతో ప్రి ఐసియు బ్లాక్, 15 పడకలతో పోస్ట్ ఐసియు బ్లాక్, మూడు ఆపరేషన్ థియేటర్లు, 20 పడకలతో రెండు జనరల్ వార్డులు, మరుగుదొడ్లు ఉన్నాయి. పరిపాలనా విభాగంలో కార్యాలయం, డాక్టర్ల గదులు, డైరెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, మరుగుదొడ్లు నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Tirumala brahmotsavam 2021, Tirumala Temple