Tirupati By poll Result: తిరుపతిలో వాడిన కమలం... డిపాజిట్ గల్లంతు.. అదే దెబ్బకొట్టిందా..?

ప్రతీకాత్మక చిత్రం

తిరుపతిలో (Tirupati) మ్యాజిక్ చేద్దామనుకున్న బీజేపీ (BJP) ఘోరంగా విపలమైంది. జనసేనతో (Janasena Party) పొత్తుపెట్టుకున్నా ఆ పార్టీకి పెద్దగా ప్లస్ అవలేదు.

 • Share this:
  ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ లో ఉనికి చాటుకోవాలని భావించిన ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సినీగ్లామర్, అగ్రనేతల ప్రచారం, హిందూత్వ నినాదం ఇలా ఏదీ పనిచేయలేదు. కట్ చేస్తే పట్టుమని పది శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీనే భారతీయ జనతాపార్టీ. తిరుపతి ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. కనీసం రెండోస్థానం కూడా సాధించలేకపోయింది. స్థానికంగా ఉన్న బీజేపీ నేతల ప్రభావం తప్ప.. తిరుపతి ఓటర్లు బీజేపీని పెద్దగా పట్టింకోనట్లు ఫలితాలను చూస్తే అర్ధమవుతోంది. ఇక్కడ బీజేపీకి ఓటమికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. సాధారణంగా కనిపించే అధికార పార్టీ హవాతో పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతిలోనే హామీ ఇచ్చి ఇక్కడే పోటీలోకి దిగడం, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన వ్యతిరేకత తిరుపతిలోనూ ప్రభావం చూపింది. అలాగే నాయకత్వ లోపం, బూత్ లెవల్లో సమన్వయం లేకపోవడం కూడా దెబ్బతీసింది.

  ఇక జనసేనతో పొత్తుపెట్టుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఆ పొత్తును సరిగా వినియోగించకులేదు. రాష్ట్రస్థాయి నాయకుల మధ్యే సరైనా సమన్వయం లేకపోవడంతో రెండు పార్టీల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి బలమైన కారణాలేంటో తెలిపి ఓటర్లను ఆకర్షించలేకపోయింది బీజేపీ. మిత్రపక్షం జనసేన నుంచి పవన్ కల్యాణ్ రోడ్ షో చేసినా.., ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి ప్రచారం చేసినా ఆస్థాయిలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. ఆలాగే పార్టీ అభ్యర్థిని చివరి నిముషంలో ఎంపిక చేయడం, ప్రచారంలోనూ సరైనా వాగ్దాటి చూపకపోవడం, పేలవమైన ప్రసంగాలివ్వడం కూడా తిరుపతి ఓటర్లను ఆకర్షించలేకపోయింది. కేవలం 56వేల ఓట్లకే పరిమితమై కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.

   ఇది చదవండి: ఫిజియోథెరపిస్ట్ నుంచి ఎంపీగా... గురుమూర్తి ప్రస్థానం ఇదే..


  ఇక వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆ పార్టీకి ఉన్న సానుభూతి సాధారణంగానే ఓటర్లను బీజేపీ వైపు మరల్చలేకపోయింది. ఇక బీజేపీ ప్రధానంగా ఎత్తుకున్న హిందూత్వ నినాదం ఆధ్యాత్మిక నగరంలో పనిచేయలేదు. శ్రీవారి సంపదను వైసీపీ ప్రభుత్వం దోచేస్తోందని, ధర్మపరిరక్షణకు వినియోగించడం లేదని బీజేపీ ఆరోపించింది. కానీ ఆ ఆరోపణలతో ఓటర్లను ఆకర్షించడంలో దారుణంగా విఫలమైంది. తిరుపతి ఓటర్లు హిందూత్వ నినాదం కంటే సంక్షేమ పథకాలు, అధికారానికే పట్టంకట్టారు. ఇక జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసిన ప్రధాన ఎన్నికల్లో తొలి పరీక్షలనే పొత్తు విఫలమైందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఛరిష్మాను బీజేపీ క్యాష్ చేసుకోలేకపోయింది. పవన్ అభిమానులను కూడా తమవైపుకు తిప్పుకోలేకపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. గాజు గ్లాసు గుర్తు వేరే పార్టీకి కేటాయించినా ఢిల్లీ స్థాయిలో బీజేపీ సరిగా పోరాడలేదనే అసంతృప్తిని ఇప్పటికే జనసైనికులు వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

  ఇది చదవండి:  రోజాకు కేబినెట్ బెర్త్ ఖాయమైందా...? అందుకే జబర్దస్త్ ను వదిలేస్తున్నారా..?


  Published by:Purna Chandra
  First published: