TTD Alert: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) భక్తులకి మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. భక్తుల డిమాండ్.. సౌకర్యం మేరకు.. డిసెంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, సంబంధిత దర్శన టికెట్లు ఉంటాయి. ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం300 రూపాయల దర్శన కోటాను శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయగా.. కేవలం కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5 లక్షల 6 వేల,6 వందల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే డిసెంబర్ నెల టికెట్ల కోటాను అక్టోబర్ లోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని డిసెంబర్ నెల నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది.
మరోవైపు పద్మావతి అమ్మవారి (Sri Padmavathi Ammavaru) ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఎందుకంటే.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ప్రారంభించింది టీటీడీ. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
ప్రతి ఏడాది అమ్మవారికి కార్తీక మాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 19వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala Temple