తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఏ మతానికి చెందిన వారైనా రావచ్చని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందుకోసం ఎలాంటి డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో వస్తే చాలు.. ఏ మతస్థులైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నారన్న ఆయన.. వాళ్లందరి మతాలను గుర్తించి మనం డిక్లరేషన్ అడుగుతున్నామా అని అన్నారు. చంద్రబాబు నాయుడు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైవీ సుబ్బారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల సహా రాష్ట్రంలో ఎక్కడా అన్యమత ప్రచారాలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కోవిడ్ -19 కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 23న సీఎం హోదాలో గరుఢ సేవలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 24న కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కర్ణాటకకు చెందిన సత్రాల భూమి పూజలో ఇరువురు సీఎంలు పాల్గొంటారు. కాగా, ఇవాళ్టి నుంచి నుంచి 27వ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati