TIRUMALA TIRUPATI DEVASTHANAM TTD WONT ENTERTAIN RECOMMENDATIONS FOR VAIKUNTA EKADASI NEW YEAR SK
Tirumala Temple: సిఫార్సు లేఖలపై TTD అధికారుల షాకింగ్ నిర్ణయం..
తిరుమల ఆలయం(ఫైల్ ఫొటో)
Tirumala News: రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా తిరుమలకు వస్తేనే వైకుంఠ ఏకాదశి రోజున టికెట్లు కేటాయిస్తామని టీటీడీ వెల్లడించింది. వారితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం ఆరుగురికి మాత్రమే దర్శనం టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది.
తిరుమలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నుంచి ఊరట లభించడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగానే తరలిస్తున్నారు. సాధారణ రోజుల్లోనే తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. అలాంటిది ప్రత్యేక రోజులు, సెలవులు, పర్వదినాల సమయాల్లో భక్తుల రద్దీ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో డిసెంబరు 25 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు నూతన సంవత్సరం కూడా సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తే అవకాశముంది. వీటిని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 25, 26తో పాటు జనవరి 1 తేదీల్లో సిఫార్సు లేఖలను అనుమతించేది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
మిగిలిన రోజుల్లో పరిస్థితిని బట్టి పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. అంతేకాదు వైకుంఠ ఏకాదశి సమయంలో వీఐపీ భక్తుల దర్శనాల్లో పలు ఆంక్షలు విధించింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా తిరుమలకు వస్తేనే వైకుంఠ ఏకాదశి రోజున టికెట్లు కేటాయిస్తామని వెల్లడించింది. వారితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం ఆరుగురికి మాత్రమే దర్శనం టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. ఇతర విఐపిల విషయానికొస్తే.. కుటుంబంలో నలుగురికి మాత్రమే దర్శనం టికెట్లు కేటాయిస్తామని పేర్కొంది. ఈసారి 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించనుంది టీటీడీ.
ఈ 10 రోజుల్లో బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు టికెట్ ధర రూ.1000 గా నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు కూడా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో దాతులకు నిర్దేశించిన టైమ్ స్లాట్లను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని రావాలని సూచించారు. ఇక చిత్తూరు, తిరుపతిలోని స్థానికుల కోసం డిసెంబరు 24 నుంచి మహాతి, బైరాగిపట్టెడె, ఎంఆర్పల్లెలో టిక్కెట్లు అందజేయనున్నారు. టికెట్ లేనివారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు శ్రీవారి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఇందుకోసం రోజుకు 20వేల చొప్పున మొత్తం 2 లక్షలను టికెట్లను కోటాను విడుదల చేసింది. ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లేదా గోవిందా యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఐతే అన్నీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. స్థానికుల కోసం మరో 80వేల టికెట్లను డిసెంబరు 24 నుంచి అందుబాటులో ఉంచుతారు. 5 ప్రత్యేక కౌంటర్ల ద్వారా తిరుమల వాసులకు ఈ టికెట్లను అందజేస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.