తిరుమలలో వివాదాస్పదంగా మారిన ‘శిలువ తరహాలో ఉన్న లైటింగ్’పై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. దాన్ని తొలగించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన లైటింగ్ శిలువ తరహాలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయితే, దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖండించింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి తావు లేదని స్పష్టం చేసింది. ఆలయ అలంకరణలకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో వైరల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరులమలో ఆలయ ప్రాకారాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఐతే ప్రాకారంపై కలశం ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసిన ‘తాళపత్ర నిధి’ అనే ఫేస్ బుక్ గ్రూప్ లో తప్పుడు సమాచారం పోస్ట్ చేశారని టీటీడీ ఆరోపించింది.
ఆలయ ప్రాకారాలపై హనుమంత, గరుడ, పూర్ణకుంభ ఆకారాల్లో దీపాలంకరణలు చేయడం కొన్ని దశాబ్దాలుగా వస్తోందని టీటీడీ ప్రకటించింది. పవిత్రమైన కలశాన్ని శిలువగా మార్ఫింగ్ చేసి కుట్రపూరితంగా దుష్ప్రచారం చేశారని పాలకమండలి ఆరోపించింది. ఫేస్ బుక్ గ్రూప్ లో జరుగుతున్న ప్రచారం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. పవిత్రమైన ఆలయానికి సంబంధించి భక్తుల్లో ఆందోళన రేకెత్తించేలా ప్రచారం చేయడం తగదని టీడీపీ పేర్కొంది. దీపాలంకరణను మార్ఫింగ్ చేసిన తాళపత్ర నిధి ఫేస్ బుక్ URLలో పాటు ఇతరులపైనా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ తెలిపింది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం పై తరచూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుండటం వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపింది. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇలాంటి వారిపై చట్టపరంగ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజాగా, ఆ లైటింగ్ మొత్తాన్ని సిబ్బంది తొలగించారు.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఫొటో
@ysjagan@yvsubbareddymp@VSReddy_MP@ncbn@BJP4Andhra@naralokesh@PawanKalyan@YSRCParty@YSRCPDMO@AskAnshul
CM Sir, Pl rectify this mistake on TTD lighting in form of cross & santa
Enquiry has to be made on these kind of frequent incidents in TTD, Tirumala pic.twitter.com/rZANyJ2hVa
— 🇮🇳Yeshwanth🇮🇳 (@yeshukrish1987) December 28, 2020
తిరుమల కొండపై తరచూ అన్యమత ప్రచారం అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంది. ఇతర మతాలకు చెందిన కరపత్రాలు, గ్రంధాలు దర్శనమిస్తుండటంతో పాలక మండలి తీరుపై విమర్శలు వస్తున్నాయి. అలాగే టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగుల అంశం కూడా వివాదం రేపుతోంది. ఇటీవలే అన్యమత ఉద్యోగులకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. 9 మంది ఉద్యోగులపై విచారణ జరపాలను ఆదేశించిన హైకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి పూర్తి వివరాలివ్వాలని టీటీడీ ఈవో, ఛైర్మన్ తో పాటు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇక గతంలో తిరుమల కొండపైకి వెళ్లే బస్ టికెట్ల వెనుక జెరుసలెం యాత్ర వివరాలను ముద్రించడం, డిక్లరేషన్ వంటి వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అన్యమత ప్రచారమంటూ వైరల్ కావడంతో టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam