Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు, రేపటి నుంచి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవ (File)

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ సోమవారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు.

 • Share this:
  శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ సోమవారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల చొప్పున టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందిస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులను మాత్ర‌మే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమ‌లకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. త్వరలో దర్శనాల సంఖ్య పెంచుతామని.. ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఉచిత దర్శనాలను స్వల్ప సంఖ్యలో పునరుద్దరిస్తాము అన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని.. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది అన్నారు. పరిస్థితిని సమీక్షించి భక్తుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాము అంటున్నారు.

  తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిశాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవ నిన్న వైభవంగా ముగిసింది.. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, చక్రాతాళ్వార్కు ప్రత్యేక స్నపన తిరుమంజనం నిర్వహించారు.

  మరోవైపు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టీటీడీ ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

  క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో అడ‌విని త‌ల‌పించేలా ఏర్పాట్లు

  కోవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ ‌మండ‌పం ఆవ‌ర‌ణంలో టీటీడీ అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా రూపొందించిన న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేశారు.

  పార్వేట ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుప‌ల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోక‌క‌ల్యాణం, క‌రోనా నివార‌ణ కోసం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోనే ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా పార్వేట ఉత్స‌వాన్ని కూడా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన జీయ‌ర్‌స్వాముల‌కు, అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

  ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాాలు చేశారు. అధికమాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: