తిరుమల శ్రీవారు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇకపై తిరుమలేశుడి ఉత్పత్తులు ప్రతి ఇంట్లోనూ దర్శనమివ్వనున్నాయి. భక్తులను అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్నే కాదు.. స్వచ్ఛమైన గో ఆధారిత ఉత్పత్తులను అందించేందుకు మన వెంకటేశ్వరస్వామి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల నుంచి లభించే సహజ పదార్థాల నుంచి సౌందర్య ఉత్పత్తులు తయారు చేయాలని భావిస్తోంది. వీటి నుంచి సబ్బులు, అగరబత్తిలు, క్రిమిసంహారకాలు, ఫేస్ క్రీములు, హెయిల్ ఆయిల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల నుంచి వివిధ ఆలయాలకు పాలు, టీటీడీ ఉద్యానవనాలు, తోటలకు గో ఆధారిత ఎరువులను సరఫరా చేస్తోంది.
గోవుల నుంచి వచ్చే ‘పంచగవ్య’ ఉత్పత్తులు... అనగా పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం నుంచి సరికొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై టీటీడీ ఓ కమిటీని కూడా నియమించనుంది. ఈ కమిటీలో డెయిరీ ఫామ్ నిపుణులతో పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు కూడా సభ్యులుగా ఉండనున్నారు. టీటీడీ అధికారులు ప్రస్తుతం నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గోవిజ్ఞాన్ అనుసంధాన్ కేంద్ర’తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంస్థ గోవులు, గో ఆధారిత వ్యవసాయం, ఆరోగ్యం, జంతు సంరక్షణ గురించి పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే గోవిజ్ఞాన్ అనుసంధాన్ కేంద్ర ప్రతినిథులు ఈ అంశంపై టీటీడీ అధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
గో ఆధారిత ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గో సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై టీటీడీ అధికారులు గుజరాత్ లోని ‘బన్సీ గిర్ గోశాల’తో కూడా చర్చలు జరుపుతోంది. ఇప్పటికే బన్సీ గిర్ గోశాల వ్యవస్థాపకుడైన గోపాల్ భాయ్ సుతారియా తిరుపతిలో టీటీడీ అదికారులతో భేటీ అయ్యారు. గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో టీటీడీకీ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆవు పాలు, పెరుగు, మూత్రం, పేడలో ఉంటే సహజ ఔషధాల నుంచి హెయిర్ ఆయిల్, ఫేస్ పౌడర్లు, ఫేషియల్ క్రీములు, మసాజ్ ఆయిల్స్ తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించే వీలుంటుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గోవులుండటంతో బ్రాండ్ టీటీడీ పేరుతో ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం పెద్ద కష్టమేమి కాదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు టీటీడీ వేగంగా చర్యలు తీసుకుంటున్నందున అతి త్వరలోనే శ్రీవారి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Telugu news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd, Ttd news, YV Subba Reddy