తిరుమల వెళ్లే భక్తులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. తిరుమల వెళ్లే భక్తులు ఇక ఆర్టీసీ బస్సుల్లోనే శ్రీవారి శీఘ్రదర్శనం టికెట్లు తీసుకోవచ్చు. ఈ మేరకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. ఇలా ప్రతిరోజు 1000 శీఘ్ర దర్శనం టికెట్లు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. టికెట్లు తీసుకున్నవారికి ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవారి శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది.
ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కలుపుకుని రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్డ్ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. ఇక, తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్టుగా అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc, Tirumala, Tirumala news, Ttd