ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ జిల్లా (Kakinada District) లో గత రెండు రోజులుగా వింత జంతువు తిరుగుతోందంటూ ప్రచారం జరిగింది. ప్రతిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేస్తోందంటూ రైతులు హడలిపోయారు. ఐతే దాదాపు పది రోజులుగా నెలకొన్న మిస్టరీకి అధికారులు తెరదించారు. గ్రామ శివారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు అది ఏ జంతువనేది గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాలకు నిద్రలేకుండా చేస్తున్నది పెద్దపులి (Tiger) గా తెలింది. సీసీ కెమెరాల ఆధారంగా అధికారులు పులిజాడలను గుర్తించారు. పులిని పట్టుకునేందుకు ఆయా గ్రామాలతో పాటు శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే 120 మంది అటవీ సిబ్బందిని మోహరించారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో పశువులపై ఈ పులి దాడి చేస్తోంది. పులిదాడిలో ఆరు గేదెలు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి గేదెను చంపి వదిలేసిన ప్రదేశానికి దగ్గర్లోని ఊదరేవడిలోని నీటి కుంట వద్దకు వచ్చిన సమయంలో సీసీ కెమెరాకు చిక్కింది.
గ్రామస్తులు, స్థానిక రైతులిచ్చిన సమాచారంతో రెండు రోజుల క్రితంరంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలుత పాదముద్రలు, దాడిచేసిన విధానాన్ని గుర్తించలేని అధికారులు ఓ క్లారిటీకి రాలేకపోయారు. ఐతే మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో పులి కెమెరాకు చిక్కింది. ఐతే ప్రస్తుతం అది ప్రజలపై దాడి చేయడం లేదని.. ఆహారం కోసం పశువులను మాత్రమే వేటాడుతోందని తెలిపారు. పులిని దారిమళ్లించేందుకు యత్నిస్తామని.. కుదరకపోతే బంధించేందుకు ఆపరేషన్ మొదలుపెడతామన్నారు.
ఐతే రాత్రులు, తెల్లవారుజామున ప్రజలెవరూ బయటకు రావొద్దని జిల్లా అటవీ శాఖ అధికారి ఐవీకే రాజు తెలిపారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని... సిబ్బంది ద్వారా ఇంటింటికీ సమాచారం అందిస్తున్నామన్నారు. గ్రామానికి ఐదుగురు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేశామని.. ఎలాంటి అలికిడి ఉన్నా వారికి తెలయజేయాలని ఆయన చెప్పారు.
ఐతే ఈ పులి ఇక్కడికి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లా అంటే మైదాన ప్రాంతం. ప్రతిపాడు మండలంలో పెద్దగా అటవీ ప్రాంతం లేదు. వొమ్మంగి గ్రామ శివారులో మాత్రం చిన్నపాటి అటవీ ప్రాంతం ఉంది. ఐతే దీనికి ఆనుకొని అడవులేమీ లేవు. మరి ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశమైంది. అక్కడే పుట్టిపెరిగిందా.. లేక రంపచోడవరం ఏజెన్సీవైపు నుంచి వొమ్మంగి ప్రాంతానికి రావాలంటే పులి దాదాపు 80 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మధ్యలో అడవులు పెద్దగాలేవు, హైవేలు, రోడ్లు గ్రామాలుచాలానే ఉన్నాయి. ఇటు వంతాడ వైపు నుంచి వచ్చిందనుకున్నా.. దాదాపు అసాధ్యమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Tiger Attack