వైసీపీకి షాక్... రాజధానిపై 3 నెలలు ఆగాల్సిందేనా?

ఆఘమేఘాలపై విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ తెలివిగా షాకిచ్చినట్లైంది. 3 నెలల పాటూ ఈ అంశం మరుగున పడబోతోందా?

news18-telugu
Updated: January 23, 2020, 6:14 AM IST
వైసీపీకి షాక్... రాజధానిపై 3 నెలలు ఆగాల్సిందేనా?
వైఎస్ జగన్
  • Share this:
రాజధానిని అమరావతి నుంచీ విశాఖకు తరలించి... అక్కడ పరిపాలనా రాజధానిని ఏర్పాటు చెయ్యాలని అత్యంత వేగంగా రెండు బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి మండలిలో షాక్ ఇచ్చింది టీడీపీ. తెలివిగా వ్యవహరించి... సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులు పంపేలా చెయ్యడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వైసీపీ కోరుకున్నట్లు అత్యంత వేగంగా రాజధానిని అమరావతి నుంచీ విశాఖకు తరలించి, వికేంద్రీకరణ చేపట్టే అవకాశం లేకుండా పోయింది. సెలెక్ట్ కమిటీలో బిల్లుల ప్రక్రియ ముగియడానికి కనీసం 3 నెలలు పడుతుందని తెలిసింది. అందువల్ల వైసీపీ ప్రభుత్వం తను కోరుకున్నట్లు చెయ్యాలంటే ఈ మూడు నెలలూ ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితి వస్తుంది కాబట్టే... ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కమిటీకి బిల్లుల్ని పంపనివ్వకుండా చూడాలని ప్రయత్నించినా... మండలిలో టీడీపీకి మెజార్టీ ఉండటం వల్ల... ఆ పార్టీ గట్టిగా పట్టుపట్టడంతో... మండలి ఛైర్మన్ విచక్షణాధికారాల్ని ఉపయోగించి... బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపారు.

తమ పంతం నెగ్గించుకున్న టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు తన పార్టీలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారిపై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ సభ్యుల్ని తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ యత్నిస్తోంది. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA ఉపసంహరణ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపినట్లైంది. మామూలుగా అయితే అలా పంపకూడదు. కానీ ఛైర్మన్ తన విచక్షణాధికారాల్ని ఉపయోగించారు. ఇలా ఆయన ఉపయోగించవచ్చా లేదా అన్న దానిపై వైసీపీ చర్చిస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఛైర్మన్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. ఇప్పుడు అమరావతికి మద్దతు ఇస్తున్న వారంతా ఛైర్మన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసలు సెలక్ట్ కమిటీ అంటే ఏంటి? దాన్ని విధులు ఏంటి? సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా? టీడీపీకి లాభం జరుగుతుందా? మూడు రాజధానులు అటకెక్కినట్టుగా భావించాలా? ఈ అంశాలను తెలుసుకుందాం. ఓ బిల్లు వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తే సభ్యులు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరతారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపాదించింది కాబట్టి, మండలి నుంచే సెలక్ట్ కమిటీని కూడా ఎంపిక చేయాలి. శాసనసభలో స్పీకర్ కమిటీలను వేస్తారు. శాసనమండలిలో చైర్మన్ కమిటీలను నియమిస్తారు. శాసనమండలిలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలుసుకుని, వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా సభ్యులను ఎంపిక చేస్తారు. అంటే ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది సెలక్ట్ కమిటీలో ఉంటారు.

ఓ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత ఆ కమిటీ సభ్యులు బిల్లు వల్ల ప్రభావితం అయ్యే వారి వాదనలను వింటారు. అంటే అమరావతి రైతులతో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాల వారి వాదనలను కూడా వినాలి. మొత్తం 13 జిల్లాల్లోని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు, వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అనంతరం ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత ఆ బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపుతుంది. సెలక్ట్ కమిటీ పరిశీలించి రూపొందించిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తారు. అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి శాసనమండలికి వస్తుంది. మండలి సెలక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలకు మళ్లీ శాసనసభలో సవరణలు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓ రకంగా మండలి సెలక్ట్ కమిటీ ప్రతిపాదించే సూచనలకు శాసనసభలో మళ్లీ మార్పులు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్లీ మండలికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే ఓకే. ఒకవేళ బిల్లు ఓడిపోతే రెండోసారి శాసనసభలో అదే బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినట్టుగా తేల్చుతారు. ఇదంతా జరిగేటప్పటికి మరో మూడు నెలలు పట్టే అవకాశాలున్నాయి.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు