ఏపీలోని మూడు రాజధానుల అంశం ఈ నెల 23న విచారణకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం... ప్రతివాదులతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసు విచారణను సాధ్యమైనంత తొందరగా చేపట్టాలని అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 23న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తే విశాఖకు(Visakhapatnam) పరిపాలన రాజధానిని తరలించాలని ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది.
ఢిల్లీలో ఈ నెల 31 జరిగిన గ్లోబల్ సమ్మిట్ సమావేశంలో ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుందని అన్నారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ కేంద్రంగానే రాష్ట్ర కార్యకలాపాలు జరగనున్నాయని చెప్పారు. సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
ఇక మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి భారీగా పెట్టుబడిదారులు రావాలని జగన్ కోరారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం కూడా కావాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గడిచిన మూడేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Kurool: నిరుద్యోగులకు శుభవార్త..!
ఈ కేసు కోర్టులో ఉండగానే సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లబోతున్నట్టు ప్రకటించడంతో విపక్షాలు, పలు వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఇది కోర్టును ధిక్కరించడమే అని ఆరోపించాయి. అయితే విశాఖకు వెళ్లడానికి కొంత సమయం ఉందని.. అప్పటిలోగా న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటామని వైసీపీ ముఖ్యనేతలు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఈ కేసు విచారణను త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఈ నెల 24 కేసు విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. మొత్తానికి విశాఖకు తరలి వెళ్లాలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందా ? లేదా ? అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh