GT Hemanth Kumar, Tirupathi, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా విలయం (Corona Virus) సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ లో రోజురోజుకీ భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలోని రెండు ముఖ్యనగరాలను మాయదారి వైరస్ కమ్మేస్తోంది. అవే విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupathi) నగరాలు. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ప్రతిరోజూ వేలసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిత్యం లక్షల మంది ప్రయాణం సాగించే తిరుపతిలో ఫీవర్ ఫియర్ పట్టుకుంది. ఓ వైపు పాజిటివ్ కేసులు పెరుతున్న వేల నగరంలో జ్వరం పీడితులు అధికంగా ఉన్నట్లు అధికారుల అంచనా. చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక తిరుపతిలో నమోదు కావడం అటు భక్తుల్లో ఇటు స్థానికుల్లో తీవ్ర కలవరానికి కారణం అవుతోంది. తిరుపతి నగరం కోవిడ్ హాట్ స్పాట్ గా మారుతోందన్నా భావన రానే వచ్చేసింది. జ్వరం., దగ్గు., ఇతర కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు అధిక సంఖ్యలో రుయా స్విన్స్ ఆసుపత్రి వద్ద బారులు తీరుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఏపీలో అత్యధిక కోవిడ్ కేసులు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక జిల్లాగా పేరొందిన చిత్తూరు జిల్లా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో టాప్-3లో ఉంటోంది. కరోనా ప్రారంభం నుంచి చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి. ఆదివారం ఒక్క రోజు చిత్తూరు జిల్లాలో 1100కుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో సగానికిపైగా తిరుపతి నగరానికి చెందిన కేసులే. ప్రస్తుతం జిల్లాలో 11వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇదంతా కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుందని తెలుస్తోంది.
కరోనా విషయంలో తిరుపతి నగరం హాట్ స్పాట్ గా మారిందన్న తెలుస్తోంది. ఒక్క తిరుపతి నగరంలోనే లక్షకుపైగా జ్వర పీడితులు ఉన్నట్లు అంచనా. ఇందులో 80 శాతానికి పైగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే మొదటి, రెండవ వేవ్ లతో పోల్చితే జనాల్లో కరోనా పట్ల భయం బాగా తగ్గింది. చాలామంది పరీక్షలకు కూడా వెళ్లడం లేదు. లక్షణాలు కనిపించిన వెంటనే మందుల దుకాణాలకు వెళ్లి మందుల కిట్ తీసుకొని ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. చాలామంది పాజిటివ్ ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారు. అయితే సీజనల్ జ్వరమా, కోవిడ్ జ్వరమా తెలీక మరికొంతమంది సతమతమవుతున్నారు. సాధారణ జ్వరానికి, కోవిడ్ జ్వరాన్ని కొన్ని తేడాలు ఉన్నప్పటికీ సరిగ్గా పోల్చుకోవడంలో రోగులు తికమకపడుతున్నారు.
మరోవైపు జ్వర పీడితులతో, కోవిడ్ అనుమనితులతో తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చాలావరకు నిలిపేశారు. కోవిడ్ పరీక్ష కోసం రుయా ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వెళ్తున్నారు. అయితే ఇక్కడ నిర్ధారణ పరీక్షలు బాగా కట్టడి చేశారు. ఒక రోజుకి 60 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే 60 టోకన్లు పంపిణీ చేసి తర్వాత కౌంటర్ లు మూసేస్తున్నారు. దీంతో అటు తర్వాత వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రుయా ఆసుపత్రిలో కరోనా టెస్టుల వివాదంపై ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ భారతి స్పందించారు. కరోనా లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు..60 సం" పైబడి వ్యాక్సినేషన్ వేయించుకోని వారికే కరోనా పరీక్షలు నిర్వహించి కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు అవసరం లేదని నిబంధనలు ఉన్నాయన్నారు.. ఇప్పటి వరకూ 140 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ అయిందని, ఇందులో 80 శాతం మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు.. మొత్తం 12 మంది సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలియజేశారు.. కరోనా పరీక్షలు చేయలేదనే ఆందోళన వద్దన్నారు. మాస్క్ లు తప్పని సరిగా ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు. అలా అని కరోనా వ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దని సూచించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona cases, Tirupati