హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఈ చిట్టితల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు... మాటలకందని విషాదం ఇది..

Andhra Pradesh: ఈ చిట్టితల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు... మాటలకందని విషాదం ఇది..

ఛాముండేశ్వరి దేవి

ఛాముండేశ్వరి దేవి

కన్నీళ్లకే కన్నీళ్లొస్తే.. కష్టానికే కష్టం వస్తే.. అనే మాట ఈ చిన్నారి జీవితానికి సరిపోదు. 11 ఏళ్లలో రెండుసార్లు అనాథగా మిగిలిపోయింది. నా అనేవాళ్లు లేక మౌనంగా రోదిస్తోంది.

  దురదృష్టం అంటే ఆ చిట్టితల్లిదే. పసిగుడ్డుగా ఉన్నప్పుడే కన్నవారు రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఆ పాప బోసినవ్వులు చూసిన ఓ వ్యక్తి చలించిపోయాడు. తనకు పిల్లలు లేని లోటు తీర్చుకునేందుకు పొత్తిళ్లలో ఉన్న ఆ బంగారుతల్లిని దత్తత తీసుకున్నాడు. ఆ పాప తన అదృష్టమనుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. అంతలోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. ఐతే తల్లిమాత్రం ఆ పాపలోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇంతలో కరోనా మహమ్మారి తల్లిని కూడా బలితీసుకుంది. అంతే పదేళ్ల పాటు తల్లిదండ్రుల ఆలనాపాలనలో పెరిగిన చిట్టితల్లి మళ్లీ అనాథ అయింది. గతంలో ఎక్కడ నుంచి దత్తత వచ్చిందో మళ్లీ అక్కడికే వెళ్లింది. అంతేకాదు తల్లిదండ్రుల తరపు బంధువులు ఆస్తిపై కన్నేశారు. ఆస్తికావాలంటున్నారు కానీ.. ఆ బంగారు తల్లిని కాదంటున్నారు. దీంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులే ఆమె ఆలనా పాలన చూస్తున్నారు.

  వివరాల్లోకి వెళ్తే.. 2010లో నెల్లూరు నగరంలో రోజుల వయసున్న ఆడ శిశువును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ పాపను చేరదీశారు. ఐతే కలెక్టరేట్లోని ఓ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న పీలం రమణయ్య అనే వ్యక్తి ఆ పాపను చూసి చలించిపోయారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ పాపను దత్తత తీసుకున్నారు. అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా ఆ పాపను తీసుకుకున్నారు. పాపకు ఛాముండేశ్వరి దేవిగా పేరుపెట్టుకున్నారు. అప్పటి నుంచి పాపను ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకున్నారు. ఐతే పాపకు రెండున్నరేళ్లు వచ్చినా మాటలు రాకపవడంతో వైద్యులకు చూపించారు. ఆమె పుట్టుకతోనే చెవుడు మూగ అని తేల్చారు. అయినా సరే గుండె దిటవు చేసుకున్న రమణయ్య, దొరసానమ్మ దంపతులు పాపకు అన్ని రకాల వైద్యం చేయించారు. ఖర్చుకు వెనకాడకుండా అన్ని ఆస్పత్రులకు తిప్పారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో ఆ పాపను చూసుకుంటూ చదివిస్తున్నారు. పాప ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏమోగాని రమణయ్యకు సూళ్లూరు పేట డీటీగా ప్రమోషన్ కూడా వచ్చింది.

  బాలికతో ఐసీడీఎస్ అధికారులు

  అంతలోనే చీకటి...

  అంతా బాగుందనుకునే సమయంలో రమణయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత రమణయ్య భార్య.. నెల్లూరు రూరల్ మండలం గుడిపాటిపల్లిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసి పాపలోనే తన భర్తను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఆ చిట్టితల్లి పట్ల విధి కర్కశంగా వ్యవహరించింది. దొరసానమ్మకు కరోనా సోకడంతో ఇటీవలే ఆమె మృతి చెందారు. దీంతో పాప మళ్లీ అనాథ అయింది.

  ఇది చదవండి: తిరుమలలో గుప్తనిధులున్నాయా...? ఆ సొరంగంలో ఏమున్నాయి..?


  మళ్లీ ఒంటరి

  తల్లిదండ్రులు దూరమవడంతో వారి తరపు బంధువులు ఆమెను చూసుకునేందుకు ముందుకు రాలేదు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ పాపను.. ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. దీంతో 11 ఏళ్ల క్రితం స్త్రీ శిశుసంక్షేమ శాఖ హోమ్ నుంచి దత్తత వెళ్లిన బాలిక మళ్లీ అక్కడికే చేరింది. ప్రస్తుతం బాలికను ఐసీడీఎస్ అధికారులే చూసుకుంటున్నారు.

  ఆస్తి కోసం కుట్రలు

  పీలం రమణయ్య కలెక్టరేట్ లో సూపరింటెండ్ గా ఆతర్వాత డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేయడంతో ఇల్లు, ఆస్తిని కూడబెట్టారు. పాప చెవుడు మూగ అవడంతో ఆమె బాధ్యత తీసుకోవడానికి ముందుకురాని బంధువులు.. ఆస్తి కోసం మాత్రం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రమణయ్య సోదరుడు ఆస్తి తనకే చెందాలని వాదిస్తున్నట్లు సమాచారం. ఐతే అధికారులు మాత్రం చట్టప్రకారం ఆస్తి అంతా పాపకే చెల్లుతుందని.. ఎవరికీ చెందదని స్పష్టం చేస్తున్నారు.

  ఇది చదవండి: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. దేశంలో ఇదే మొదటిసారి..


  కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూడని వయసులోనే అనాథైన ఛాముండేశ్వరి... లోకం అంటే ఇది.. తల్లిదండ్రులంటే వీళ్లే.. అని తెలుసుకొని వారితో హాయిగా జీవితం గడుపుతున్న సమయంలో మళ్లీ ఒంటరైంది. తల్లిదండ్రులు దూరమయ్యారంటూ గట్టిగా రోదించలేక మౌనంగా బాధపడుతోంది. కడుపులోకి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలే కన్నీళ్లను దిగమింగుతోంది. ఎవరైనా పలకరిస్తే వారిపై దీనంగా చూస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Nellore Dist