హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నేటి నుంచి శ్రీవారి దర్శనం.. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు..

నేటి నుంచి శ్రీవారి దర్శనం.. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు..

తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

తొలుత మొత్తం 24 కౌంటర్ల ద్వారా ప్రతి రోజు 3వేల టికెట్లను మంజూరు చేయాలని భావించారు. కానీ భక్తులు పోటెత్తడంతో అదనంగా మరో 750 టికెట్లను, అంటే మొత్తం ఒక్కరోజుకు 3750 టోకెన్లను భక్తులకు అందజేశారు.

  తిరుమల శ్రీవారి దర్శనం ఎట్టకేలకు లాక్‌డౌన్ అనంతరం నేటి నుంచి భక్తులకు కలగనుంది. అందులో భాగంగానే మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో దర్శన అవకాశం ఇచ్చారు. ఇకపోతే గురువారం నుంచి భక్తులందరిని అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి, తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం అందజేసింది. తొలుత మొత్తం 24 కౌంటర్ల ద్వారా ప్రతి రోజు 3వేల టికెట్లను మంజూరు చేయాలని భావించారు. కానీ భక్తులు పోటెత్తడంతో అదనంగా మరో 750 టికెట్లను, అంటే మొత్తం ఒక్కరోజుకు 3750 టోకెన్లను భక్తులకు అందజేశారు. దర్శనానికి ఒక రోజుముందుగా ఈ టికెట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ దర్శనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. చిన్న చిన్న లోపాలను గుర్తించిన అధికారులు వాటిలో మార్పులు చేశారు.

  ఇప్పటివరకు కేవలం స్థానికులు, ఉద్యోగులకు మాత్రమే దర్శనం కల్పించారు. కానీ నేటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలిపిరిలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్లు ఉన్నవారినే తిరుమలకు పంపాలని పేర్కొన్నారు. కొండకు వచ్చేవారిలో రోజుకు 200మంది నుంచి ర్యాండమ్‌గా శాంపిల్స్ తీసుకుని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

  ఇందులో ఉదయం మొదటిగంట సేపు వీఐపీలకు కేటాయించారు. మరో రెండు మూడు రోజుల పాటు దర్శనాల్లో ఇబ్బందులు ఎదురుకాకపోతే భక్తులను పెంచేందుకు టీటీడీ ఆలోచిస్తోంది. ఇదిలావుంటే... మంగళవారం భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.20.85 లక్షల ఆదాయం సమకూరినట్టు టీటీడీ తెలిపింది.

  Published by:Anil
  First published:

  Tags: Tirumala news, Tirumala Temple, Ttd

  ఉత్తమ కథలు