కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల బోసిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేయడం.. కొండపైకి భక్తులెవరినీ అనుమతించకపోవడంతో తిరుమలంతా నిర్మానుష్యంగా మారింది. ఈ నేపథ్యంలో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అటవీ జంతువులు ఘాట్ రోడ్డు, ప్రధాన ఆలయం పరిసరాల్లోకి వచ్చి సంచరించాయి. తాజాగా పాపవినాశనంలోని ఓ దుకాణంలో ఓ భారీ కొండ చిలువ స్థానికుల కంటపడింది. లాక్‌డౌన్ వల్ల దాదాపు 60 రోజులుగా వ్యాపారులు దుకాణాలను తెరవలేదు. అయితే గురువారం కొంతమంది వ్యాపారులు తమ దుకాణాలను ఓసారి పరిశీలించుకునేందుకు వచ్చారు. అక్కడ ఓ వ్యాపారి తన దుకాణం తెరవగా, అక్కడ భారీ కొండ చిలువ ప్రత్యక్ష్యమయ్యింది. దీంతో ఒక్కసారిగా వ్యాపారి భయాందోళన చెందాడు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో పాములు దుకాణాల్లో సేదతీరుతున్నాయి. ఇటీవలే ఓ భారీ నాగుపాము సైతం తిరుమల ఆలయం సమీపంలో స్థానికుల కంటపడిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Ttd