RRR: రఘురామపై థర్డ్ డిగ్రీ పార్లమెంట్‌కే అవమానం.. ఏపీ సీఐడీపై కేరళ ఎంపీ ఆగ్రహం

ప్రేమ్ చంద్రన్, రఘురామ కృష్ణంరాజు

రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని ప్రేమ్ చంద్రన్ అన్నారు. ఎంపీని కొట్టడమంటే పార్లమెంట్‌ను అవమానించడమే అని విమర్శించారు.

  • Share this:
    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ గత నెలలో ఏపీలో సంచలన రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు. ఐతే సీఐడీ కస్టడీలో తనను కొట్టారని, కాళ్లకు గాయాలయ్యాయని రఘురామ ఆరోపించడం దుమారం రేపింది. తాజాగా ఈ అంశంపై కేరళకు చెందిన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) ఎంపీ ఎన్‌.కే. ప్రేమ్ చంద్రన్ స్పందించారు. ఏపీ సీఐడీ కస్టడీలో తను కొట్టారని ఎంపీ రాసిన లేఖపై ఆయన మాట్లాడారు. రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని ప్రేమ్ చంద్రన్ అన్నారు. ఎంపీని కొట్టడమంటే పార్లమెంట్‌ను అవమానించడమే అని విమర్శించారు. ఎంపీ పట్ల ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో ఖచ్చితంగా మాట్లాడతానని స్పష్టంచేశారు ప్రేమ్ చంద్రన్.

    కాగా, ఎంపీ రఘు రామ కృష్ణంరాజును మే 14న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. ఐతే కస్టడీలో సీఐడీ పోలీసులు తనను కొట్టారని, రాత్రంతా వేధింపులకు గురిచేశారని జడ్జికి రఘురామ ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై గాయాలతో కూడిన ఫోటోలను కూడా సమర్పించారు. ఎంపీ గాయాలకు సంబంధించి గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి కోర్టుకు రిపోర్ట్ అందజేశారు. అవి పోలీసుల కొట్టినవి కావని తేల్చారు. ఎడిమా వల్లే అరికాళ్లు అలా మారిపోయాయని కోర్టుకు తెలిపారు.

    అనంతరం రఘురామ కృష్ణంరాజు తన వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి నివేదికను కోర్టుకు సమర్పించారు. ఎంపీ కాలికి ఫ్రాక్చర్ అయిందని అందులో పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ నెల 21న రఘరామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ఎంపీపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరరు చేస్తున్నట్లు తెలిపింది. అయితే సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. విచారణకు మాత్రం సహకరించాలని స్పష్టం చేసింది. అనంతరం ఆయన విడుదలయ్యారు.
    Published by:Shiva Kumar Addula
    First published: