మీరు భజరంగీ భాయిజన్ సినిమా చూశారుగా. అందులో ఓ చిన్నారి తప్పిపోతుంది. హీరో ఆమెను పాకిస్థాన్ వరకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. అచ్చం అలాంటి సీనే ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకుంది. ఓ యువకుడు.. ఐదేళ్ల కిందట నిజంగానే తప్పిపోయాడు. ఇంటికెళదామంటే.. దారి తెలియదు. తన దగ్గరున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఎవరికైనా.. చెబుదామంటే భాష రాదు. అలా ఐదేళ్లు గడిపేశాడు. ఇన్నాళ్లకు అతడి అదృష్టం బిటెక్ స్టూడెంట్ రూపంలో వచ్చింది. విద్యార్థి సహకారంతో తిరిగి తన వాళ్లను చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భరత్మాన్ జిల్లా మసాజ్గ్రామ్ గ్రామానికి చెందిన పర్సన్ జిత్.. ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం గోవా వెళ్లాడు. ఎంతో కొంత డబ్బులు సంపాదించి.. తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం పనిచేసి నాలుగేళ్ల క్రితం తిరిగి స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడలో తప్పిపోయాడు. కొంతమందిని అనుసరిస్తూ.. కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు.
తాను ఎక్కడున్నాడో అతడికే తెలయదు. భాషరాదు.. ఇక్కడి మనుషులు తెలియదు. కొంతకాలానికి తెచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి. భిక్షాటన చేస్తూ.. కాలం గడిపాడు. అయితే పర్సన్ జిత్‌ను తిరుపతమ్మ ఆలయం వద్ద పచ్చబొట్లు వేసే ఇజ్రాయిల్ అనే వ్యక్తి చేరదీశాడు. వివరాలు తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. తెలుగు రాక.. వివరాలు చెప్పినా.. అర్థమయ్యేది. కాదు.. అలా ఇజ్రాయిల్ దగ్గరే ఆ యువకుడు నాలుగేళ్లుగా ఉంటున్నాడు. కొంతకాలం నుండి భవన నిర్మాణ కూలి పనులకు వెళుతున్నాడు. ఇదే అతడి జీవితాన్ని మళ్లీ తన వాళ్ల దగ్గరకు చేరేలా చేసింది.
తీగల పవన్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు పర్సన్ జిత్. బెంగాలీ ఎక్కువగా మాట్లాడుతున్న.. పర్సన్ జీత్‌ను పవన్ కుమార్ కదిలించే ప్రయత్నం చేశాడు. వచ్చిరాని.. తెలుగులో మాట్లాడుతున్న పర్సన్ జిత్ తో పవన్ మాట్లాడాడు. తన ఊరు వెళ్లాలని.. తన అమ్మనాన్నలు కలుసుకోవాలని పవన్‌తో చెప్పాడు. పర్సన్ జిత్ చెప్పిన అడ్రస్‌ను పవన్ గూగుల్‌లో వెతికి వెతికి. .. అతడు చదివిన స్కూల్ ను గుర్తించాడు. ఫేస్బుక్ ద్వారా ఆ స్కూల్లో చదివిన విద్యార్థులను గుర్తించాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వారితో వాట్సాప్ వీడియో కాల్ మట్లాడారు. ఆ వెంటనే... వారు వెళ్లి ఆ యువకుడి తల్లిదండ్రులకు చెప్పి వారితో కూడా యువకుడితో మాట్లాడించారు. ఐదేళ్ల కిందట తప్పిపోయిన కొడుకును వీడియో కాల్ లో చూసి.. ఆ తల్లిదండ్రులు, తన కన్నవారిని చూసిన పర్సన్ జిత్‌కు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు.. తామంతా మళ్లీ కలుసుకుంటామని వారు పడిన ఆనందం అందరినీ కదిలించింది. ఈ విషయాన్ని బీటెక్ విద్యార్థి పవన్ కుమార్.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరవేశాడు.
బెంగాల్ పోలీసులు సైతం పవన్‌తో మాట్లాడారు. యువకుడి కుటుంబ సభ్యులు గురువారం పెనుగంచిప్రోలు వచ్చి.. పోలీస్ స్టేషన్లో యువకుడికి సంబంధించిన ఆధారాలు చూపించారు. దీంతో పోలీసులు పర్సన్ జీత్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోషల్ మీడియా సాయంతో తమ బిడ్డను అప్పగించిన పవన్ కుమార్ కు పర్సన్ జిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Telugu news, West Bengal