ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల నిర్ణయం రాజ్యాంగానికి లోబడే తీసుకున్నారా అని అడిగింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధతను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్. వరలక్ష్మి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
ఈ అంశంపై సర్కారు తరఫున ప్రభుత్వ న్యాయవాది సుమంత్ రెడ్డి స్పందిస్తూ పారిశ్రామికవేత్తలు ఎవరైనా దీనిపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది తప్ప న్యాయవాదులు, ఇతరులకు అవకాశంలేదని వాదనలు వినిపించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంలో ప్రజాప్రయోజనం కూడా ఇమిడి ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే ఈ నిర్ణయం తీసుకుందా? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కోరగా, సానుకూలంగా స్పందించిన ధర్మాసనం నెల రోజుల పాటు సమయం ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, Highcourt