శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం.. ఏం చేస్తారో తెలుసా..?

అర్చకులు పెద్ద జీయంగార్, చిన్న జీయంగారుకు టిటిడి తరఫున సీఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు.

news18-telugu
Updated: July 16, 2020, 1:24 PM IST
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం.. ఏం చేస్తారో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు.

చిన్న జీయంగార్‌, ఛైర్మన్‌, ఈవో, అద‌న‌పు ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనుల వారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ''పరివట్టం''(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు పెద్ద జీయంగార్, చిన్న జీయంగారుకు టిటిడి తరఫున సీఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు.

అనంతరం ఆస్థానం ముగిసింది. వాస్తవానికి ఈ ఆణివార ఆస్థానం ఎందుకు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. ఇంతకీ ఈ ఆస్థానాన్ని ఎందుకు నిర్వహిస్తారంటే.. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు..
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలు సమర్పించారు. గురు‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  ఇదిలావుంటే..

శ్రీ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం..
టిటిడి ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది శ్రీవారి ఆల‌యంలో నిర్వ‌హించే సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానంను శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ‌రంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌యం నుండి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించార‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో నిత్య కైంక‌ర్య‌లు, ఉత్స‌వాలు, నిత్యం ప్ర‌తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి తీసుకున్న చ‌ర్య‌లు, భ‌క్తుల స‌హాకారంతో ద‌ర్శ‌నాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. శ్రీవారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆయురారోగ్యాల‌తో ఉండాలన్నారు.‌
Published by: Narsimha Badhini
First published: July 16, 2020, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading