అతడో చిరు వ్యాపారి. పందులను మేపుకొని వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చిన చిన్నచిన్న లాభాలనే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లక్షల రూపాయలు కూడబెట్టాడు. ఓ పదిలక్షలు పోగేసి ఇల్లుకట్టుకోవాలనుకున్నాడు. ఆ డబ్బులను ఎవరికీ తెలియకుండా ట్రంకుపెట్టెలో దాచిపెట్టాడు. డబ్బులు అవసరమై ట్రంకుపెట్టె తెరిచి చూసి బావురుమున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా మైలవరం మండల కేంద్రానికి చెందిన బిజిలి జమలయ్య అనే వ్యక్తి స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద నివాసముంటూ పందుల వ్యాపారం చేస్తున్నాడు. పందులను మేపి వాటిని విక్రయించడం అతడి వృత్తి. కుటుంబ సభ్యులు కూడా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారంలో వచ్చిన లాభాలను ఇంట్లో దాచి పెట్టుకున్నాడు.
నిరక్షరాశ్యుడైన జమలయ్య బ్యాంక్ ఎకౌంట్లపై అవగాహన లేకపోవడంతో డబ్బులన్నీ ఓ తుప్పుపట్టిన ట్రంకుపెట్టెలో దాచాడు. ఇందులో రూ.500 నోట్ల నుంచి రూ.10 నోటు వరకు అన్నింటినీ జాగ్రత్తగా దాచిపెట్టాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ట్రంకు పెట్టెలో వేస్తున్నాడు గానీ ఏనాడు సరిగా చూసుకోలేదు. ఈ క్రమంలో ఓ వ్యాపారికి లక్షరూపాయలు ఇవ్వాల్సి వచ్చి డబ్బుల కోసం ట్రంక్ పెట్టె తెరిచి చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతడు కూడబెట్టిన డబ్బులన్నీ చెదలు తినేశాయి. నోట్లకట్టలను ముక్కలుముక్కలు చేశాయి. రూ.5లక్షల్లో రూపాయి కూడా పనికిరాకుండా పోయింది.
రాత్రంతా షాక్ లోనే ఉన్న జమలయ్య మంగళవారం ఉదయం ట్రంకు పెట్టెలో చెదలుపట్టిన డబ్బులు తీసి మంచంపైవేసి లెక్కపెట్టడం ప్రారంభించాడు. విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో ఆనోటా ఈ నోటా పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు ఇంటికెళ్లి చూడగా.. వారిని చూసి బోరుమన్నాడు. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని వేడుకున్నాడు. పోలీసులు మాత్రం నిజంగా దాచుకున్న డబ్బులా లేక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
కడుపుకట్టుకొని.. తిని తినకగా.. ఏళ్ల తరబడి దాచిన డబ్బులను తనకు చెదలు తినేయడంతో జమలయ్య కుటుంబమంతా షాక్ లోనే ఉంది. మరోవైపు బాగా ఉన్నప్పుడు అన్ని అవసరాలు తీర్చిన డబ్బులు.. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పనికిరాకుండా పోయాయి. మొత్తానికి జమలయ్యకున్న అతి జాగ్రత్త, నిరక్షరాస్యత వెరసి ఏకంగా ఐదు లక్షల రూపాయలు పురుగుల పాలు చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Currency, Krishna District, Telugu news, Vijayawada