Hindupuram: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో హిందూపురం (Hindupuram) నియోజకవర్గానికి ప్ర్తత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. అప్పుడే రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా అఖిలపక్ష నేతలు బంద్ కు పిలుపు ఇవ్వడంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ మధ్య వైసీపీ లీడర్ రామకృష్ణారెడ్డి మర్డర్‌పై సోమవారం బంద్‌కు అఖిల పక్షం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ముందస్తుగానే అరెస్టులు చేస్తుండడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. వైసీపీ లీడర్ రామకృష్ణారెడ్డి మర్డర్ (Ramakrishna Reddy Murder) పై ఇప్పటికే అనే అనుమానాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హత్య జరిగి మూడు వారాలవుతున్నా.. ఉద్రిక్తతలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మర్డర్ జరిగిన మూడు వారాలకు నిందితుల అరెస్ట్ చూపించిన పోలీసులు హత్యకు రాజకీయ కారణాలే కారణమని తేల్చడం.. మరింత ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా అఖిలపక్ష నేతలు బంద్ కు పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూపురంలో కాకుండా ధర్మవరంలో అరెస్టులు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రామకృష్ణారెడ్డి హత్య కేసులో పోలీసుల తీరుకు నిరసనగా హిందూపురం బంద్‌కి పిలుపునిచ్చింది అఖిలపక్షం. దాంతో, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బంద్ చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. హిందూపురంలో పోలీస్ యాక్ట్ 30 ఇప్పటికీ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు పోలీసులు. పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా బంద్‌కు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమని డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, ఎవరిపైనైనా అనుమానాలుంటే పై అధికారులకు ఫిర్యాదులు చేయండి.. లేదా న్యాయస్థానాలను ఆశ్రయించండి.. కానీ ఇలా బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ అఖిలపక్ష నేతలు ఈ విషయంలో వెనక్కు తగ్గేదేలే అంటున్నారు. మరి బంద్ నిర్వహిస్తారా.. లేకా పోలీసులు విజయవంతంగా అడ్డుకుంటారా..? అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది.
ఇదీ చదవండి : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో భారీ ఉద్యోగ మేళా.. అర్హతలు ఇవే
ఇప్పటికే అఖిల పక్ష నేతలు రేపటి బంద్ పై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఎలా వ్యవహరించాలి అన్నదానిపైనా ఫోకస్ చేస్తున్నారు. ఇటు పోలీసులు సైతం.. కీలక నేత ఇళ్ల దగ్గరకు భారీగా చేరుకుని.. ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో నిజమైన నిందితులను అరెస్ట్ చేసే వరకు తాము వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు నేతలు. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించిన విధంగా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌ను ఏ1, గోపికృష్ణను ఏ2గా, సీఐ జీటీ నాయుడును ఏ3 గా కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ చేయించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Hindupuram