Amaravati Protest: అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత

ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అమరావతి జేఏసీ నిరసన తెలుపుతుండగా, అక్కడే ధర్నా చేసేందుకు కొందరు వైసీపీ నేతలు కూడా అనుమతి తీసుకున్నారు.

news18-telugu
Updated: October 22, 2020, 4:27 PM IST
Amaravati Protest: అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత
అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోదీ (File)
  • Share this:
అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెంలో హైటెన్షన్ నెలకొంది. అమరావతి నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ధండరాయునిపాలెంలోనే శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనా ప్రదేశంలో అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకే రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపడుతున్నారు. అయితే, మూడు రాజధానులకు మద్దతుగా అదే ప్రాంతానికి వచ్చేందుకు కొందరు వైసీపీ నేతలు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. దీంతో వెంటనే జేఏసీ నిరసన ముగించాలని పోలీసులు అమరావతి జేఏసీకి తెలిపారు. ‘మీరు ఖాళీ చేస్తే తర్వాత మూడు రాజధానులు కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఇక్కడికి వస్తారు.’ అని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఒక రాజధాని కోసం కానీ మూడు రాజధానులు కోసం కాదంటూ పోలీసులకు స్పష్టం చేశారు. అలాగే, అమరావతి జేఏసీ, రైతులు అప్పటికే నిరసన తెలుపుతున్న సమయంలోనే, దానికి పూర్తి విరుద్ధంగా నిరసన తెలిపే వారికి అనుమతి ఎలా ఇస్తారని పోలీసులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శంకుస్థాపన ప్రదేశానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బిల్లులు కూడా తెచ్చింది. ఆబిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. వాటికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఆమోదముద్ర వేశారు. అయితే, ఎన్నికలకు ముందు రాజధానిని తరలించబోమని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అదే మాటకు కట్టుబడి ఉండాలని, ఒకే రాజధాని ఉండాలంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇటీవలే వారి నిరసనలు 300 రోజులు పూర్తి చేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ముందస్తుగా సిద్ధం చేస్తుంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో శాసనరాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించింది.

మూడు రాజధానులకు సంబంధించి కోర్టుల్లో కూడా వివాదం కొనసాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మూడు రాజధానులు ఉండొచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని అని క్లారిటీ ఇచ్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందన్న కేంద్రం.. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది. రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని.. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని కేంద్రం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

కొన్ని రోజుల క్రితం ఏపీ మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని ఆయన తెలిపారు. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అన్నట్టు వెల్లడించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అంటే కోర్టుకు వెళ్లి స్టే తేవడం విడ్డూరమని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading