news18-telugu
Updated: December 24, 2020, 7:35 PM IST
జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో జేసీ అనుచరులు కొందరు అసభ్య పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో జేసీ అనుచరులు సైతం ఆందోళన మొదలుపెట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ.. రెండు వర్గాలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి తమ ఇంటిపై దాడికి ప్రయత్నిస్తే మీరేం చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇరు వర్గాలకు చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి వెంటనే తాడిపత్రి బయలుదేరి వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను తాడిపత్రికి తరలిస్తున్నారు.
మరోవైపు స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాడి చేశారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యే తమ ఇంటిపై దాడికి పాల్పడితే పోలీసులు ఏం చేస్తున్నారని జేసీ అనుచరులు పోలీసులపై మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర పని చేసే దాసరి కిరణ్ అనే వ్యక్తిపై పెద్దారెడ్డి అనుచరులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
December 24, 2020, 2:01 PM IST