ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party). పేరుకు ప్రతిపక్షమే అయినా ఆ స్థాయిలో సీట్లు లేవు. నాయకులు కూడా కరువయ్యారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి ఎదురెళ్లి పోరోడే యువరక్తం పార్టీలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1982లో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నవారు. వివిధ రంగాలకు చెందిన యువకులు పసుపు కండువా కప్పుకొని బరిలో దిగారు. అప్పట్లో యువనాయకులుగా ఉన్నవారు పార్టీని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు వారంతా సీనియర్లుగా మారిపోయారు. అదే సమయంలో చాలా మంది వయోభారంతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీలో సీనియర్లను కాదని... వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా ఉండే వారికే అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సీనియర్ నేతల వారసులను రంగంలోకి దించేశారు. ఇప్పటికే తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేస్తున్న బాబు.. పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు నడిపించే నాయకుల కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులను పక్కన పెట్టి... వారి స్థానంలో వాళ్ల వారసులకు అవకాశం ఇస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఇప్పటికే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రెండు సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన రామూను ఈ సారి అసెంబ్లీ బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ 2019లో పోటీ చేసి ఓడారు. మరో మాజీ మంత్రి, సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు వారసునిగా మృణాళిని కుమారుడు నాగార్జున ఇప్పటికే చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కూడా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. ఇక కేఈ కృష్ణమూర్తి కుమారుడు కూడా అధ్యక్ష అనేందుకు రెడీగా ఉన్నారు.
ఇదే తరహాలో మరికొంతమంది యువకులు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. 40వ పడిలోకి అడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ... యువకులతో నవ యవ్వనంగా మారుతోంది. ఐతే యువనాయకత్వం పేరుతో సీనియర్లను పక్కనబెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదని.. రెండు వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్లాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.