వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తాం...మాజీ మంత్రి యనమల హెచ్చరిక

కేవలం ఫిర్యాదులతోనే సరిపెట్టకుండా తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తామని, ఐపీసీ చట్టాల ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి యనమల స్పష్టంచేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 8:59 PM IST
వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తాం...మాజీ మంత్రి యనమల హెచ్చరిక
యనమల రామకృష్ణుడు(File)
  • Share this:
చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై అప్రస్తుతంగా, తప్పుడు ప్రచారం చేసిన వైసీపీనేతలు  ఐటీశాఖ పంచనామా నివేదిక రాగానే తెల్లమొహాలేశారని, విష ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐటీశాఖ తన పంచనామా నివేదికలో రూ.2.63లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, సరైన లెక్కలుచూపడంతో వాటిని కూడా తిరిగిచ్చేసిందని, దాన్ని వదిలేసి, రూ. 2వేలకోట్లు దొరికాయని అడ్డగోలుగా, అవాస్తవాలతో దుష్ప్రచారం చేశారని యనమల మండిపడ్డారు. 3 ఇన్ ఫ్రా కంపెనీల గురించి ఐటీశాఖ తననివేదికలో చెబితే, ఆ కంపెనీలన్నీ జగన్ కు అత్యంత సన్నిహితమైనవి కావడంతో వాటిని గురించి మంత్రులుగానీ,  వైసీపీ మీడియా గానీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. మాజీ పీఎస్ ఇంట్లో ఎక్కడా రూ. 2 వేలకోట్లు దొరికినట్లు ఐటీ చెప్పలేదన్నారు. బోగస్ కంపెనీలు కొన్ని రూ.2 వేల కోట్ల వరకు పన్నులావాదేవీలకు సంబంధించిన బకాయిలు ఎగ్గొట్టాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఐటీశాఖ నివేదికలో ఏ వాక్యంలోకూడా మాజీ పీ.ఎస్. శ్రీనివాస్ ఇంట్లోనే రూ.2 వేల కోట్లు దొరికినట్లుగా చెప్పలేదన్నారు. సబ్ కాంట్రాక్టులు, ఇన్ ఫ్రా కంపెనీల ద్వారానే రూ.2 వేల కోట్లవరకు అక్రమ లావాదేవీలు జరిగాయన్నారు. కేవలం ఫిర్యాదులతోనే సరిపెట్టకుండా తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తామని, ఐపీసీ చట్టాల ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి యనమల స్పష్టంచేశారు.

అలాగే  సెలెక్ట్ కమిటీ అంశం ఛైర్మన్ పరిధిలోనే ఉంటుందని, ఆయన తనకున్న అధికారంతోనే మూడురాజధానులబిల్లు అంశాన్నికమిటీకి పంపుతారని, శాసనమండలి కార్యదర్శికి, ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఉండబోదన్నారు. ఛైర్మన్ నిర్ణయాన్ని ఇప్పటికే మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించాడని, మూడోసారి ఛైర్మన్ నిర్ణయమే అంతిమమని యనమల స్పష్టంచేశారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన చేయడమే ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరమని, దానిపై కూడా మండలిసభ్యులందరూ రాష్ట్రపతిని, గవర్నర్ ని కలిసి, ఫిర్యాదు చేయనున్నట్లు మాజీమంత్రి తెలిపారు. కౌన్సిల్ లో బిల్లులు పెండింగ్ లో ఉండగానే దాన్ని రద్దు చేయడం, మూడురాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయిందన్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు