• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TELANGANA POLICE ALLOW AMBULANCE FROM ANDHRA PRADESH AFTER HIGH COURT ORDERS SU

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లకు అనుమతి.. ఈ-పాస్ లేకున్నా తెలంగాణలోకి ఎంట్రీ..

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లకు అనుమతి.. ఈ-పాస్ లేకున్నా తెలంగాణలోకి ఎంట్రీ..

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిన అంబులెన్సులు

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

  • Share this:
    తెలంగాణ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేకపోయినప్పటికీ.. సరిహద్దులో అంబులెన్స్‌లను ఆపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు.. ఈ రోజు ఉదయం నుంచి పాస్‌లు లేని వాహనాలను, అంబులెన్స్‌లను పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం కోర్టు జారీచేసిన ఆదేశాలు అందడంతో.. అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

    మరోవైపు సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద కూడా ఉదయం నుంచి అమలు చేసిన ఆంక్షలను సడలించారు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌ను పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

    ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో చికిత్స నిమిత్తం వచ్చే అంబులెన్స్‌లు, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో వచ్చే కోవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నేటి ఉదయం నుంచి పాసులు లేకుండా రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్స్‌లను, వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇది సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీసింది.

    హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకట క్రిష్ణారావు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అంబులెన్స్‌లు ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. నాలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కరోనా రోగుల తాకిడి ఎక్కువైందన్నారు. ఆస్పత్రి ముందస్తు అనుమతి ఉన్నవారికి చికిత్స నిరాకరించడం లేదని కోర్టుకు తెలిపారు.

    దీనిపై స్పందించిన న్యాయస్థానం.. జాతీయ రహదారులపై అంబులెన్స్‌లను ఆపే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అని మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు